
వణికిన ఒడిశా
సాక్షి, భువనేశ్వర్, బరంపురం: పై-లీన్ తుపాను ఒడిశా రాష్ట్రాన్ని తీవ్రస్థాయిలో వణికించింది. ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు కళ్లికోట్‌లో చెట్టుకూలడంతో మరణించారు. భారీ వర్షం, గాలుల కారణంగా రైళ్లు, విమాన సర్వీసులను రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించగా.. మిగిలిన వాటిని ఒడిశా, ఆంధ్రాలోని వివిధ రైల్వే స్టేషన్లలో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గంజాం, పూరీ, కేంద్రపర, ఖుర్దా, జగత్‌సింగ్‌పూర్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పారాదీప్ పోర్టును అధికారులు మూసివేశారు. ఆ ప్రాంతంలో సముద్రం 25 మీటర్ల మేర ముందుకు వచ్చింది. తీర ప్రాంతంలో 3 నుంచి 5 మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడ్డాయి. భారీ వర్షాలకు గాలులు తోడవడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దాదాపు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గజగజలాడిన గంజాం
గంజాం జిల్లాపై పై-లీన్ ప్రభావం ఎక్కువగా ఉంది. శనివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ జిల్లాలోని గోపాల్‌పూర్ సమీపంలో తుపాను తీరం దాటినట్టు అమెరికా వాతావరణ శాఖ ప్రకటించింది. జిల్లాలోని ప్రధాన నగరాలైన బరంపురం, గోపాల్‌పూర్, పురుషోత్తంపూర్ తదితర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. ఈ ప్రాంతాలలో శనివారం రోజంతా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. రాత్రికి ఈ వేగం సుమారు 200 కిలోమీటర్లు దాటింది. బరంపురం, గోపాల్‌పూర్ సహా తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి వసతులు కల్పించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నించింది. మహానదికి వరద ముప్పు పొంచి ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజలు రోజంతా ఇళ్ల నుంచి బయటకు రాలేదు. బరంపురం నిర్మానుష్యంగా మారింది. తుపాను తీరం దాటిన తర్వాత కూడా ఆరేడు గంటల పాటు గాలులు ఉధృత ంగా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందారు.