గంటకి ఆరు ఇళ్లు కూల్చివేత | Daily Thousands of Houses Down In India | Sakshi
Sakshi News home page

గంటకి ఆరు ఇళ్లు కూల్చివేత

Published Wed, Mar 21 2018 10:08 PM | Last Updated on Thu, Aug 30 2018 4:51 PM

Daily Thousands of Houses Down In India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రోడ్డుని విస్తరించాలి.. కమ్యూనిటీ హాల్‌ నిర్మించాలి లేదంటే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి.. కారణం ఏదైతేనేం మన దేశంలో వేలాది ఇళ్లునేలమట్టమవుతున్నాయి. లక్షలాదిమంది ప్రజలు రోడ్డున పడిపోతున్నారు. 2017 సంవత్సరంలోనే గంటకి ఆరు ఇళ్లు కూల్చేశారు.  ప్రతీ రోజూ 700 మంది గూడుచెదిరింది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకుండా, పునరావాసం ఏర్పాట్లు చూడకుండానే ఇదంతా చేయడంతో నిర్వాసితుల గుండె పగిలింది.  గత ఏడాది 53,700ఇళ్లను కూల్చేశారని, 2.6 లక్షల మందిని బలవంతంగా ఖాళీ చేయించారని హౌసింగ్‌ అండ్‌ల్యాండ్‌ రైట్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.

స్మార్ట్‌ జపంతో కొంప కొల్లేరు
ఇప్పుడు అందరూ స్మార్ట్‌ జపమే చేస్తున్నారు. దేశంలో ప్రతీనగరాన్ని స్మార్ట్‌ సిటీ చేసేస్తామని ప్రభుత్వం ప్రకటించి గుడిసెల్ని తొలగిస్తూ ఉండడంతో నిలువ నీడ లేక రోడ్డున పడుతున్న వారి సంఖ్య ఎక్కువైపోయింది. గత ఏడాది వివిధ రాష్ట్రాల్లో గుడిసెల్ని తొలగించే కార్యక్రమాలు  213 వరకు జరిగాయి. ఇందులో నగరాల సుందరీకరణకు సంబంధించి 99, రోడ్లు, హైవేల విస్తరణ కోసం 53, ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం 16, వన్యప్రాణులు, అటవీ ప్రాంతాల సంరక్షణ పేరుతో 30 వరకు జరిగాయి.

చిన్న కారణాలకూ ఇళ్ల తొలగింపు
ఒకరి ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా, కుటుంబాల గోడు వినకుండా ఇళ్లను బలవంతంగా కూల్చివేయడం మానవ హక్కుల్ని కాలరాయడమేనని ఐక్యరాజ్య సమితి చెబుతున్నా పట్టించుకునే వారు లేరు. చిన్న చిన్న కారణాలకు కూడా అన్ని నగరాల్లోనూ ఈ ఇళ్ల తొలగింపు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది .ఢిల్లీలో ఫ్లైఓవర్ల బ్యూటిఫికేషన్‌ కోసమే 1500 ఇళ్లను తొలగించారు. కథ్‌పుట్లి అనే కాలనీలోని 2 వేల ఇళ్లను తొలగించారు. ముంబైలో టాన్సా పైప్‌లైన్‌ సమీపంలో ఉన్న 16,717 ఇళ్లనుతొలగించారు. ఇక కోల్‌కతాలో బుక్‌ ఫెయిర్‌కి వెళ్లడం కోసం రోడ్డు వేయడానికి 1200 మంది కుటుంబాలను ఖాళీ చేయించారు. ఇండోర్‌లో టాయిలెట్స్‌ లేవన్న సాకుతో 700 ఇళ్లు నేలమట్టం చేశారు.

అసోంలో అభయారణ్యాలకు సమీపంలో నివాసం ఉంటున్న బోడో, రాభా, మిషింగ్‌ వంటి గిరిజన తెగలకు చెందిన వెయ్యి కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించారు. వారి ఇళ్లను తొలగించడానికి ఏనుగుల సహకారాన్ని తీసుకున్నారు. అందరికీ ఇళ్లు హామీని నిలబెట్టుకోవడం కోసం ఉన్న ఇళ్లను తొలగించడం చర్చనీయాంశంగా మారుతోంది. 2022 నాటికి అందరికీ ఇళ్లు అన్న కేంద్ర పథకాన్ని అమలు చేయడం కోసం గత ఏడాది 6,937 ఇళ్లను కూల్చేశారు. నిరాశ్రయులైన వారిలో 60శాతం మంది తమ గూడు చెదిరిపోవడానికి ప్రభుత్వాలదే కారణమని నిందిస్తున్నారు. మొత్తానికి నగరాలు అందంగా ముస్తాబవుతూ,స్మార్ట్‌గా మారుతున్నాయో లేదో కానీ నిలువ నీడలేని వారి సంఖ్య మాత్రం పెరిగిపోతోంది. (సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement