houses damaged
-
ఇండోనేసియాలో భూకంపం
జకార్తా: ఇండోనేసియా ఆగ్నేయప్రాంతంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. ఈస్ట్ నుసా తెంగ్గారా ప్రావిన్స్ రాజధాని కుపంగ్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూమికి 36 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. దీని తీవ్రతతో కుపంగ్ నగరంలోని ఇళ్లు, ఇతర భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొంది. -
బోరుమంటున్న మొరంచపల్లి.. సర్వం కోల్పోయిన దీనస్థితి..
భూపాలపల్లి అర్బన్: మొత్తం 285 ఇళ్లు.. అందులో నాలుగు పూర్తిగా ధ్వంసమయ్యాయి.. మిగతావి పాక్షికంగా దెబ్బతిన్నాయి.. ఏ ఇంట్లో చూసినా పేరుకుపోయిన ఒండ్రుమట్టి.. చెల్లాచెదురుగా ఉన్న సామగ్రి.. బైక్‌లు, ఇతర వాహనాలు ఎక్కడున్నాయో తెలియదు.. తినటానికి తిండి లేదు.. తాగేందుకు నీరు లేదు.. కోళ్లు, పశువులు కొట్టుకుపోయాయి.. సర్వం కోల్పోయిన స్థితిలో జయశంకర్ జిల్లా మొరంచపల్లి గ్రామం బోరుమంటోంది. మరోవైపు గల్లంతైన నలుగురి ఆచూకీ దొరకక.. వారి కుటుంబాలు ఆవేదనలో కొట్టుమిట్టాడుతున్నాయి. గల్లంతైన గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ దంపతులు, గడ్డ మహలక్ష్మి, గంగిడి సరోజనల ఆచూకీ కోసం గ్రామస్తులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. ఏ ఆధారమూ లేని పరిస్థితిలో.. గురువారం తనను చుట్టేసిన మోరంచవాగు వరద ఉధృతికి మొరంచపల్లి గ్రామం సర్వం కోల్పోయింది. ఇళ్లలో సుమారు 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు వరద నీరు చేరింది. ప్రతి ఇంట్లో బియ్యం, పప్పుల వంటి నిత్యావసరాల నుంచి టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి ఎల్రక్టానిక్ పరికరాల దాకా వస్తువులన్నీ నీట మునిగిపోయాయి. కొన్ని వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. గ్రామంలో మొత్తం 285 ఇళ్లు ఉండగా 4 ఇళ్లు పూర్తిగా, 281 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒండ్రు మట్టి, ఇసుక మేట, చెత్తాచెదారంతో నిండిపోయాయి. శుక్రవారం వరద తగ్గాక గ్రామస్తులు ఇళ్లలో ఒండ్రుమట్టిని ఎత్తిపోస్తూ, తడిసిన వస్తువులను ఆరబెట్టుకుంటూ కనిపించారు. వరద తాకిడికి కొన్ని ఇళ్ల పునాదులు కూడా కదలడం, ఇంటి గోడలు, ప్రహరీలు కూలిపోవడం ఆందోళనకరంగా మారింది. Rescue operations in Moranchapally underway #TelanganaRains #Telangana #Bhupalapally #Moranchapalli #Moranchapalle #Rains #WeatherUpdate #IMD pic.twitter.com/cfsOToosN4 — Kartheek Naaga (@kartheeknaaga) July 27, 2023 అన్నీ కొట్టుకుపోయి.. మోరంచపల్లి గ్రామం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో కుటుంబ పోషణ నిమిత్తం గేదెలు, కోళ్లు పెంచుకుంటున్నారు. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయి పొలాలు, చెట్లపోదల్లో చిక్కుకున్నాయి. కొన్నింటి ఆనవాళ్లు కూడా దొరకలేదు. మొత్తం 159 పశువులు, గేదెలు, 3 ఎద్దులు, 855 కోళ్లు, 3 బాతులు చనిపోయాయి. గ్రామ పరిసరాల్లో అక్కడక్కడా చనిపోయి ఉన్న గేదెలను అధికారులు శుక్రవారం జేసీబీల సహాయంతో గ్రామానికి దూరంగా తరలించి ఖననం చేశారు. గ్రామస్తులకు భరోసా.. తీవ్రంగా నష్టపోయిన మోరంచపల్లి గ్రామాన్ని మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అధికారులు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక జీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డి రూ.10 లక్షలను గ్రామ ప్రజలకు ఆర్థిక సాయంగా అందించారు. చేతుల్లోంచి జారిపోయింది.. ఈ ఫొటోలోని వ్యక్తి గడ్డం శ్రీనివాస్. ఆయన భార్య మహాలక్ష్మి గురువారం వరదలో కొట్టుకుపోయింది. ఇంకా ఆచూకీ లభించలేదు. ‘‘గురువారం తెల్లవారుజామున 4 గంటలకు వరద ఉధృతి పెరగడంతో ఇంట్లోంచి బయటికి వచ్చాం. భుజాల లోతున నీరు వేగంగా దూసుకువచ్చింది. ఇద్దరం కలసి అక్కడున్న రేకుల షెడ్డు స్తంభాన్ని పట్టుకున్నాం. కానీ నీటి వేగానికి మహాలక్ష్మి నా చేతుల్లోంచి జారిపోయింది. ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించినా వరద నన్ను మరోపక్క నెట్టేసింది. కళ్ల ముందే కొట్టుకుపోయిన భార్యను కాపాడుకోలేకపోయా’’ అంటూ శ్రీనివాస్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇది కూడా చదవండి: గోదావరి డేంజర్ లెవల్.. అందుబాటులో ఎన్డీఆర్ఎఫ్, హెలికాప్టర్ -
గంటకి ఆరు ఇళ్లు కూల్చివేత
సాక్షి, హైదరాబాద్ : రోడ్డుని విస్తరించాలి.. కమ్యూనిటీ హాల్ నిర్మించాలి లేదంటే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి.. కారణం ఏదైతేనేం మన దేశంలో వేలాది ఇళ్లునేలమట్టమవుతున్నాయి. లక్షలాదిమంది ప్రజలు రోడ్డున పడిపోతున్నారు. 2017 సంవత్సరంలోనే గంటకి ఆరు ఇళ్లు కూల్చేశారు. ప్రతీ రోజూ 700 మంది గూడుచెదిరింది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకుండా, పునరావాసం ఏర్పాట్లు చూడకుండానే ఇదంతా చేయడంతో నిర్వాసితుల గుండె పగిలింది. గత ఏడాది 53,700ఇళ్లను కూల్చేశారని, 2.6 లక్షల మందిని బలవంతంగా ఖాళీ చేయించారని హౌసింగ్ అండ్‌ల్యాండ్ రైట్స్ నెట్వర్క్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. స్మార్ట్ జపంతో కొంప కొల్లేరు ఇప్పుడు అందరూ స్మార్ట్ జపమే చేస్తున్నారు. దేశంలో ప్రతీనగరాన్ని స్మార్ట్ సిటీ చేసేస్తామని ప్రభుత్వం ప్రకటించి గుడిసెల్ని తొలగిస్తూ ఉండడంతో నిలువ నీడ లేక రోడ్డున పడుతున్న వారి సంఖ్య ఎక్కువైపోయింది. గత ఏడాది వివిధ రాష్ట్రాల్లో గుడిసెల్ని తొలగించే కార్యక్రమాలు 213 వరకు జరిగాయి. ఇందులో నగరాల సుందరీకరణకు సంబంధించి 99, రోడ్లు, హైవేల విస్తరణ కోసం 53, ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం 16, వన్యప్రాణులు, అటవీ ప్రాంతాల సంరక్షణ పేరుతో 30 వరకు జరిగాయి. చిన్న కారణాలకూ ఇళ్ల తొలగింపు ఒకరి ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా, కుటుంబాల గోడు వినకుండా ఇళ్లను బలవంతంగా కూల్చివేయడం మానవ హక్కుల్ని కాలరాయడమేనని ఐక్యరాజ్య సమితి చెబుతున్నా పట్టించుకునే వారు లేరు. చిన్న చిన్న కారణాలకు కూడా అన్ని నగరాల్లోనూ ఈ ఇళ్ల తొలగింపు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది .ఢిల్లీలో ఫ్లైఓవర్ల బ్యూటిఫికేషన్ కోసమే 1500 ఇళ్లను తొలగించారు. కథ్‌పుట్లి అనే కాలనీలోని 2 వేల ఇళ్లను తొలగించారు. ముంబైలో టాన్సా పైప్‌లైన్ సమీపంలో ఉన్న 16,717 ఇళ్లనుతొలగించారు. ఇక కోల్‌కతాలో బుక్ ఫెయిర్‌కి వెళ్లడం కోసం రోడ్డు వేయడానికి 1200 మంది కుటుంబాలను ఖాళీ చేయించారు. ఇండోర్‌లో టాయిలెట్స్ లేవన్న సాకుతో 700 ఇళ్లు నేలమట్టం చేశారు. అసోంలో అభయారణ్యాలకు సమీపంలో నివాసం ఉంటున్న బోడో, రాభా, మిషింగ్ వంటి గిరిజన తెగలకు చెందిన వెయ్యి కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించారు. వారి ఇళ్లను తొలగించడానికి ఏనుగుల సహకారాన్ని తీసుకున్నారు. అందరికీ ఇళ్లు హామీని నిలబెట్టుకోవడం కోసం ఉన్న ఇళ్లను తొలగించడం చర్చనీయాంశంగా మారుతోంది. 2022 నాటికి అందరికీ ఇళ్లు అన్న కేంద్ర పథకాన్ని అమలు చేయడం కోసం గత ఏడాది 6,937 ఇళ్లను కూల్చేశారు. నిరాశ్రయులైన వారిలో 60శాతం మంది తమ గూడు చెదిరిపోవడానికి ప్రభుత్వాలదే కారణమని నిందిస్తున్నారు. మొత్తానికి నగరాలు అందంగా ముస్తాబవుతూ,స్మార్ట్‌గా మారుతున్నాయో లేదో కానీ నిలువ నీడలేని వారి సంఖ్య మాత్రం పెరిగిపోతోంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
భారీ వర్షాలకు 729 ఇళ్లకు పాక్షిక నష్టం
తొగుట: మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 729 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు ఎంపీడీఓ రాజిరెడ్డి తెలిపారు. బండారుపల్లిలో 31, ఎల్.బంజేరుపల్లిలో 27, బ్రాహ్మణ బంజేరుపల్లి 11, చందాపూర్ 19, ఏటిగడ్డకిష్టాపూర్ 73, ఘనపూర్ 60, గోవర్దనగిరి 21, గుడికందుల 25, కాన్గల్ 36, లక్ష్మాపూర్ 46, లింగంపేట 27, లింగాపూర్ 23, పల్లెపహాడ్ 46, పెద్దమాసాన్‌పల్లి 40, రాంపూర్ 7, తొగుట 51, తుక్కాపూర్ 44, వరదరాజుపల్లి 20, వేములఘాట్ 42, వెంకట్రావ్పేట 21, ఎల్లారెడ్డిపేట47, జప్తిలింగారెడ్డిపల్లిలో 12 ఇళ్లకు పాక్షికంగా నష్టం వాటిల్లిందన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల బాధితులు మాట్లాడుతూ అకాల వర్షాలకు ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులమైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. -
వర్షం బాధితులను ఆదుకోండి
మంత్రి హరీశ్‌రావు ఆదేశం నంగునూరు మండలంలో పర్యటన కూలిన ఇళ్లు పరిశీలన నంగునూరు: వర్షాలతో పంటలు, ఇళ్లు నష్టపోయిన బాధిత కుటుంబాలను గుర్తించి ఆదుకోవాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పర్యటించారు. కూలిన ఇళ్లను పరిశీలించారు. అక్కేనపల్లిలోని బుడుగ జంగాల కాలనీ మొత్తం నీట మునిగిందని, నిత్యావసర వస్తులు తడిసి నష్టం వాటిల్లిందని మహిళలు మొరపెట్టుకున్నారు. స్పందించిన మంత్రి తహసీల్ధార్ గులాం ఫారూక్ అలిని పిలిచి బాధిత కుంటుంబాలకు సాయంకాలంలోగా బియ్యం, పప్పులు, నిత్యావసర వస్తువులు అందించాలని ఆదేశించారు. ఇళ్లు కూలిపోయిన వారిని గుర్తించి డబుల్ బెడ్రూం పథకం వర్తింపజేయాలన్నారు. అనంతరం ఖాత, ఘణపూర్, నంగునూరులో మంత్రి పర్యటించారు. ఆయా గ్రామాల రైతులు పంటలు నీట మునిగాయని ఆదుకోవాలని వేడుకున్నారు. పంటలు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి జాబితాను అందజేయాలని అధికారులను ఆదేశించారు. పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పురేందర్, సర్పంచ్‌లు విజయలక్ష్మి, రాధిక, లచ్చవ్వ, ఎంపీపీ ఉపాధ్యక్షుడు నర్సింలు, ఎంపీటీసీలు జయపాల్‌రెడ్డి, రామవ్వ, నాయకులు మల్లయ్య, రమేశ్‌గౌడ్, సోమిరెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, బాలు, చంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.