అక్కేనపల్లి బుడగజంగాల కాలనీవాసుల సమస్యలు వింటున్న మంత్రి
- మంత్రి హరీశ్‌రావు ఆదేశం
- నంగునూరు మండలంలో పర్యటన
- కూలిన ఇళ్లు పరిశీలన
నంగునూరు: వర్షాలతో పంటలు, ఇళ్లు నష్టపోయిన బాధిత కుటుంబాలను గుర్తించి ఆదుకోవాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పర్యటించారు. కూలిన ఇళ్లను పరిశీలించారు. అక్కేనపల్లిలోని బుడుగ జంగాల కాలనీ మొత్తం నీట మునిగిందని, నిత్యావసర వస్తులు తడిసి నష్టం వాటిల్లిందని మహిళలు మొరపెట్టుకున్నారు.
స్పందించిన మంత్రి తహసీల్ధార్ గులాం ఫారూక్ అలిని పిలిచి బాధిత కుంటుంబాలకు సాయంకాలంలోగా బియ్యం, పప్పులు, నిత్యావసర వస్తువులు అందించాలని ఆదేశించారు. ఇళ్లు కూలిపోయిన వారిని గుర్తించి డబుల్ బెడ్‌రూం పథకం వర్తింపజేయాలన్నారు. అనంతరం ఖాత, ఘణపూర్, నంగునూరులో మంత్రి పర్యటించారు. ఆయా గ్రామాల రైతులు పంటలు నీట మునిగాయని ఆదుకోవాలని వేడుకున్నారు. పంటలు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి జాబితాను అందజేయాలని అధికారులను ఆదేశించారు.
పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పురేందర్, సర్పంచ్‌లు విజయలక్ష్మి, రాధిక, లచ్చవ్వ, ఎంపీపీ ఉపాధ్యక్షుడు నర్సింలు, ఎంపీటీసీలు జయపాల్‌రెడ్డి, రామవ్వ, నాయకులు మల్లయ్య, రమేశ్‌గౌడ్, సోమిరెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, బాలు, చంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.