Rain Victims
-
బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం
సాక్షి,సిటీబ్యూరో: భారీ వర్షాలతో ఇళ్లలోకి వరదనీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి ఏజేసీ అశోక్‌కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన మీ కోసం కార్యక్రమంలో బస్తీ ప్రజలిచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఇందులో పింఛన్లు, ఇళ్లు, ఉద్యోగాలు, ఆర్థిక సహాయానికి సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి. ఆసీఫ్‌నగర్, షేక్‌పేట్, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, అంబర్పేట్ మండలాల్లోని ముంపు బస్తీల్లో ప్రజలకు ఆహార పొట్లాలు, మంచినీటి పాకెట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ, భారత్ సేవా సంఘాల ద్వారా బిస్కెట్ ప్యాకెట్లతో పాటు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశామన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లను గుర్తించామని, సంబంధిత మండల తహశీల్దార్లు బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని ప్రాంతాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అశోక్‌కుమార్ తెలిపారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు తమ సిబ్బంది పూర్తి సమాచారాన్ని నిర్దేశించిన ప్రొఫార్మాలో ఆన్లైన్ ద్వారా పంపించటంతోపాటు హార్డ్ కాపీని కూడా కలెక్టరేట్లో అందజేయాలన్నారు. ఎర్రగడ్డ తదితర ప్రాంతాలలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా విద్యార్థుల నుంచి అధిక పీజులు వసూలు చేస్తున్నారని పేరేంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు వివరాలతో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారితో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ జిల్లా శాఖల అధికారులు పాల్గోన్నారు. -
బాధితులకు భరోసా ఏదీ?
పునరావాసాల నుంచి తరలివెళ్లాలని అధికారుల ఆదేశం ఇబ్బందులు పడుతున్న ప్రజలు మెదక్ మున్సిపాలిటీ: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోగా, శిథిలావస్థకు చేరుకున్న బాధితులను ఇదివరకే స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లకు తరలించారు. రెండురోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకున్నారు. సుమారు 40 కుటుంబాల వరకు పునరావాసం పొందారు. బాధితులకు రెండు రోజులుగా ఆహార సదుపాయలు ఏర్పాటు చేశారు. సోమవారం వర్షం లేకపోవడంతో ఇక పాఠశాలలు వదిలి వెళ్లాలని అధికారులు బాధితులను ఆదేశించడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక కన్నీరు, మున్నీరవుతున్నారు. వర్షాలకు పూరిళ్లు, పెంకుటిళ్లు మెత్తబడి కూలిపోయే ప్రమాదం ఉంది. తిరిగి ఇళ్లలోకి వెళితే మాకు చావు కాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సోమవారం ఆకస్మాతుగా ఇళ్లకు వెళ్లమని చెప్పడంతో తిండికోసం చిన్నా, పెద్దలు, వృద్ధులు ఆకలితో అలమటించాల్సి వచ్చిందని బాధితులు వాపోయారు. ఉన్నఫలంగా వెళ్లాలంటే ఎక్కడికి వెళ్లి తలదాచుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోయారు. స్థానికంగా ఉన్న వారు మొక్కుబడిగా ఆహారం అందించారని వాపోయారు. ఇది ఇప్పటి వరకే గాని తమ అసలు సమస్య పరిష్కరించేది ఎవరని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గోల్కొండ బస్తీలో ఇల్లు కూలి ఇద్దరు దుర్మరణం చెందారని ఆ సంఘట ఇంకా మా కళ్లముందే మెదులుతుందన్నారు. అధికారులు పునరావాసాలను ఖాళీ చేసి వెళ్లాలని చెప్పడంతో ఎటు వెళ్లాలో అర్థం కావడం లేదన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇళ్లు దెబ్బతిన్న బాధితుల వివరాలు పట్టణంలోని 12 వార్డులో గోల్కొండ బస్తీలో సుమారు 40 ఇళ్లు వివిధ స్థాయిలోని ఇళ్లు శిథిలావస్థలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బస్తీకి చెందిన నర్స్పల్లి మహేష్, బుర్రెనొల్ల పోచమ్మ, ఫతేనగర్ సుజాత, బొడెల్లిగారి శ్యామల, గవ్వలపల్లి అంజయ్య, వినోద, చదల దుర్గయ్య, భీమయ్య, ఘనపురం నారాయణ, భవాని, జోగొల్ల అనురాధ, కిష్టయ్య, చోటబీ, సుగుణ, మల్లమ్మలతోపాటు ఇళ్లు కొన్ని దెబ్బతినగా, మరికొన్ని కూలిపోయే ప్రమాదంలో ఉన్నట్లు బాధితులు తెలిపారు. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు: బొడెల్లిగారి శ్యామల గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. శిథిలమైన ఇళ్లు, ఉరుస్తున్న ఇళ్లలో నుంచి ఉన్నఫలంగా వచ్చి పాఠశాలలో తలదాచుకున్నాం. ఇప్పుడు అధికారులు ఇళ్లకు వెళ్లమంటున్నారు. కాని పాత ఇళ్లు కావడంతో అవి తడిసి ముద్దగా మారాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. అధికారులు వెళ్లిపొమ్మనడంతో ఎటు వెళ్లాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి: వినోద ఉన్నఫలంగా పునరావాసాలను వదిలిపొమ్మంటున్న అధికారులు అసలు సమస్య పట్టించుకోవడం లేదు. రేపో మాపో కూలిపోయే ఇళ్లలోకి ఎలా వెళ్లాలి. ఎక్కడ ఉండాలి. చిన్న పిల్లలు ఉన్నారు. మా గోస ఎవరికి పట్టదా? ప్రభుత్వం స్పందించి మేము ఉండేందుకు తగిన వసతి కల్పించి ఆదుకోవాలి. అలాగే కూలిన ఇళ్లకు డబుల్ బెడ్రూంలు మంజూరు చేయాలి. బాధితులకు న్యాయం చేయాలి: అయితారం నర్సింలు, కౌన్సిలర్ పట్టణంలోని 12 వార్డులో అధికారులు పర్యటించి కూలిన ఇళ్లను పరిశీలించాలి. వార్డులోని నిరుపేదలైన ఇళ్లు కూలిన బాధితులకు, పూర్తిగా శిథిలమైన వాటికి న్యాయం చేసి ఆదుకోవాలి. -
వర్షం బాధితులను ఆదుకోండి
మంత్రి హరీశ్‌రావు ఆదేశం నంగునూరు మండలంలో పర్యటన కూలిన ఇళ్లు పరిశీలన నంగునూరు: వర్షాలతో పంటలు, ఇళ్లు నష్టపోయిన బాధిత కుటుంబాలను గుర్తించి ఆదుకోవాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పర్యటించారు. కూలిన ఇళ్లను పరిశీలించారు. అక్కేనపల్లిలోని బుడుగ జంగాల కాలనీ మొత్తం నీట మునిగిందని, నిత్యావసర వస్తులు తడిసి నష్టం వాటిల్లిందని మహిళలు మొరపెట్టుకున్నారు. స్పందించిన మంత్రి తహసీల్ధార్ గులాం ఫారూక్ అలిని పిలిచి బాధిత కుంటుంబాలకు సాయంకాలంలోగా బియ్యం, పప్పులు, నిత్యావసర వస్తువులు అందించాలని ఆదేశించారు. ఇళ్లు కూలిపోయిన వారిని గుర్తించి డబుల్ బెడ్రూం పథకం వర్తింపజేయాలన్నారు. అనంతరం ఖాత, ఘణపూర్, నంగునూరులో మంత్రి పర్యటించారు. ఆయా గ్రామాల రైతులు పంటలు నీట మునిగాయని ఆదుకోవాలని వేడుకున్నారు. పంటలు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి జాబితాను అందజేయాలని అధికారులను ఆదేశించారు. పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పురేందర్, సర్పంచ్‌లు విజయలక్ష్మి, రాధిక, లచ్చవ్వ, ఎంపీపీ ఉపాధ్యక్షుడు నర్సింలు, ఎంపీటీసీలు జయపాల్‌రెడ్డి, రామవ్వ, నాయకులు మల్లయ్య, రమేశ్‌గౌడ్, సోమిరెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, బాలు, చంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. -
బాధితులకు జానారెడ్డి పరామర్శ
నల్గొండ: అకాల వర్షాలతో నష్టపోయిన బాధితులను సీఎల్పీ నేత జానారెడ్డి పరామర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా అనుముల మండలం అల్వాల గ్రామంలో ఆయన పర్యటించారు. శుక్రవారం వచ్చిన భారీ గాలివానకు గ్రామంలో సుమారు 40 ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఆయా కుటుంబాల వారిని, రైతులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని వారికి జానారెడ్డి హామీ ఇచ్చారు.