భూపాలపల్లి అర్బన్: మొత్తం 285 ఇళ్లు.. అందులో నాలుగు పూర్తిగా ధ్వంసమయ్యాయి.. మిగతావి పాక్షికంగా దెబ్బతిన్నాయి.. ఏ ఇంట్లో చూసినా పేరుకుపోయిన ఒండ్రుమట్టి.. చెల్లాచెదురుగా ఉన్న సామగ్రి.. బైక్‌లు, ఇతర వాహనాలు ఎక్కడున్నాయో తెలియదు.. తినటానికి తిండి లేదు.. తాగేందుకు నీరు లేదు.. కోళ్లు, పశువులు కొట్టుకుపోయాయి.. సర్వం కోల్పోయిన స్థితిలో జయశంకర్ జిల్లా మొరంచపల్లి గ్రామం బోరుమంటోంది. మరోవైపు గల్లంతైన నలుగురి ఆచూకీ దొరకక.. వారి కుటుంబాలు ఆవేదనలో కొట్టుమిట్టాడుతున్నాయి. గల్లంతైన గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ దంపతులు, గడ్డ మహలక్ష్మి, గంగిడి సరోజనల ఆచూకీ కోసం గ్రామస్తులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు.
ఏ ఆధారమూ లేని పరిస్థితిలో..
గురువారం తనను చుట్టేసిన మోరంచవాగు వరద ఉధృతికి మొరంచపల్లి గ్రామం సర్వం కోల్పోయింది. ఇళ్లలో సుమారు 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు వరద నీరు చేరింది. ప్రతి ఇంట్లో బియ్యం, పప్పుల వంటి నిత్యావసరాల నుంచి టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి ఎల్రక్టానిక్ పరికరాల దాకా వస్తువులన్నీ నీట మునిగిపోయాయి. కొన్ని వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. గ్రామంలో మొత్తం 285 ఇళ్లు ఉండగా 4 ఇళ్లు పూర్తిగా, 281 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒండ్రు మట్టి, ఇసుక మేట, చెత్తాచెదారంతో నిండిపోయాయి. శుక్రవారం వరద తగ్గాక గ్రామస్తులు ఇళ్లలో ఒండ్రుమట్టిని ఎత్తిపోస్తూ, తడిసిన వస్తువులను ఆరబెట్టుకుంటూ కనిపించారు. వరద తాకిడికి కొన్ని ఇళ్ల పునాదులు కూడా కదలడం, ఇంటి గోడలు, ప్రహరీలు కూలిపోవడం ఆందోళనకరంగా మారింది.
Rescue operations in Moranchapally underway #TelanganaRains #Telangana #Bhupalapally #Moranchapalli #Moranchapalle #Rains #WeatherUpdate #IMD pic.twitter.com/cfsOToosN4
— Kartheek Naaga (@kartheeknaaga) July 27, 2023
అన్నీ కొట్టుకుపోయి..
మోరంచపల్లి గ్రామం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో కుటుంబ పోషణ నిమిత్తం గేదెలు, కోళ్లు పెంచుకుంటున్నారు. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయి పొలాలు, చెట్లపోదల్లో చిక్కుకున్నాయి. కొన్నింటి ఆనవాళ్లు కూడా దొరకలేదు. మొత్తం 159 పశువులు, గేదెలు, 3 ఎద్దులు, 855 కోళ్లు, 3 బాతులు చనిపోయాయి. గ్రామ పరిసరాల్లో అక్కడక్కడా చనిపోయి ఉన్న గేదెలను అధికారులు శుక్రవారం జేసీబీల సహాయంతో గ్రామానికి దూరంగా తరలించి ఖననం చేశారు.
గ్రామస్తులకు భరోసా..
తీవ్రంగా నష్టపోయిన మోరంచపల్లి గ్రామాన్ని మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అధికారులు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక జీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డి రూ.10 లక్షలను గ్రామ ప్రజలకు ఆర్థిక సాయంగా అందించారు.
చేతుల్లోంచి జారిపోయింది..
ఈ ఫొటోలోని వ్యక్తి గడ్డం శ్రీనివాస్. ఆయన భార్య మహాలక్ష్మి గురువారం వరదలో కొట్టుకుపోయింది. ఇంకా ఆచూకీ లభించలేదు. ‘‘గురువారం తెల్లవారుజామున 4 గంటలకు వరద ఉధృతి పెరగడంతో ఇంట్లోంచి బయటికి వచ్చాం. భుజాల లోతున నీరు వేగంగా దూసుకువచ్చింది. ఇద్దరం కలసి అక్కడున్న రేకుల షెడ్డు స్తంభాన్ని పట్టుకున్నాం. కానీ నీటి వేగానికి మహాలక్ష్మి నా చేతుల్లోంచి జారిపోయింది. ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించినా వరద నన్ను మరోపక్క నెట్టేసింది. కళ్ల ముందే కొట్టుకుపోయిన భార్యను కాపాడుకోలేకపోయా’’ అంటూ శ్రీనివాస్ కన్నీటిపర్యంతమయ్యాడు.
ఇది కూడా చదవండి: గోదావరి డేంజర్ లెవల్.. అందుబాటులో ఎన్డీఆర్‌ఎఫ్, హెలికాప్టర్
Comments
Please login to add a commentAdd a comment