‘సహరాన్‌పూర్’ బాధితులను కలిసిన రాహుల్
జిల్లాలోకి అనుమతించని అధికారులు
సహరాన్‌పూర్: కులఘర్షణలతో అట్టుడికిన ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లోకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అధికారులు శనివారం అనుమతించకపోవడంతో ఆయన బాధితులను జిల్లా సరిహద్దుల్లోనే కలిశారు. ఈ విషయాన్ని రాహుల్ ట్వీటర్‌లో తెలిపారు. సహరాన్‌పూర్‌లోని షబ్బీర్‌పూర్ గ్రామంలో మే 5న ఠాకూర్లకు, దళితులకు మధ్య జరిగిన గొడవల్లో దళితుల ఇళ్లను తగులబెట్టడం తెలిసిందే. వీరిని పరామర్శించేందుకు రాహుల్ షబ్బీర్‌పూర్ వెళ్లాలనుకున్నారు. ఆయనను గ్రామంలో పర్యటించేందుకు అనుమతించేది లేదని అధికారులు ముందుగానే హెచ్చరించారు.
బాధితులు చికిత్స పొందుతున్న వైద్యశాలకు వెళ్లేందుకైనా అనుమతి ఇవ్వాలని రాహుల్ కోరారు. వైద్యశాలలో ఇప్పుడు ఎవరూ లేరనీ, అందరినీ డిశ్చార్జి చేశారని అధికారులు చెప్పారు. అయితే కాంగ్రెస్ నేత పీఎల్ పునియా మాట్లాడుతూ, శుక్రవారం రాత్రే ఆసుపత్రికి వెళ్లాననీ, 23 మందిని అర్ధాంతరంగా డిశ్చార్జి చేసి పంపించారని అన్నారు. బాధితులకు ఇప్పటివరకు ప్రభుత్వం కేవలం రూ.5 లక్షలు పరిహారాన్ని మాత్రమే విడుదల చేయడాన్ని రాహుల్ ప్రశ్నించగా, ఈ అంశాన్ని పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు.