(బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): మనసులో అహంకారం బుసలు కొడుతోందా?, ఇతరుల అభివృద్ధి కంటగింపుగా మారుతోందా?, ఇతరులతో మాట్లాడటమంటే చిరాకా?.. అయితే మిగిలిన సామాజిక సమస్యల మాటెలా ఉన్నా ఇలాంటి లక్షణాలున్న వారికి చాలా తొందరగానే గుండెజబ్బులు వచ్చేయడం ఖాయమంటున్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న శ్రీ జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డి యోవాస్క్యులర్ సైన్సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సి.ఎన్.మంజునాథ్. ఇలాంటి టైప్–ఏ లక్షణాలున్న వ్యక్తులు తాము ఆరోగ్య సమస్యల్లో చిక్కుకుపోవడమే కాక, తమ చుట్టూ ఉన్న వారి ఆరోగ్యం పాడయ్యేందుకూ కారణమవుతారని ఆయన శనివారం బెంగళూరులో జరిగిన 107వ సైన్స్ కాంగ్రెస్ ఉత్సవాల్లో పేర్కొన్నారు.
గుండెజబ్బులతోపాటు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి సమస్యలు ఇటీవల భారత్‌లోనూ పెరుగుతున్నందుకు పలు కారణాలున్నాయని, ఒంటరితనం పెరిగిపోతుండటం, వాతావరణ కాలుష్యం, ఆర్థిక వ్యవస్థలో హెచ్చుతగ్గులూ చెప్పుకోదగ్గ కారణాలేనని ఆయన తెలిపారు. ‘‘ఒకప్పుడు పిల్లలు తల్లిదండ్రులను గుండెజబ్బుల చికిత్స కోసమని ఆసుపత్రులకు తీసుకువచ్చేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల ను తీసుకు వస్తుండటం బాధాకరం’’ అన్నారు. పోటీ ప్రపంచంలో సాధారణ జీవితం గడపడమె లా అనేది మరచిపోతున్నామన్నారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులకు 10 – 15 ఏళ్ల ముందే హృగ్రోద సమస్యలొస్తున్నాయన్న పరిశోధనలను ఆయన ఉదహరించారు.
ఇవీ కారణాలే..
ఈ కాలంలో పిన్న వయస్కు లకీ గుండెజబ్బులు వచ్చేం దుకు వాయు కాలుష్యం, ఏ పనీ చేయకుండా కూర్చుండటమూ కారణాలవుతున్నాయని మంజునాథ్ తెలిపారు. టీవీ సీరియళ్ల పేరిట, ఆఫీసు పనుల కోసమని రోజుకు మూడు నాలుగు గంటలపాటు కూర్చొని ఉండటం రోజుకు ఐదు సిగరెట్లు తాగడానికి సమానమైన దుష్ఫలితాలు ఇస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయన్నారు. ఉప్పు తక్కువగా తీసుకోవడం, వ్యసనాలకు దూరంగా ఉండటం, ఒత్తిడికి గురికాకపోవడం, వ్యాయామం గుండెజబ్బుల నుంచి రక్షణనిస్తాయని చెప్పారు.
2030 నాటికి
- గుండెజబ్బుల విషయంలో కుటుంబ చరిత్ర కూడా ముఖ్యమే. కుటుంబంలో ఎవరైనా యాభై ఏళ్ల కంటే తక్కువ వయసులో గుండెజబ్బుతో మరణించి ఉంటే మిగతా వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.
- శరీరం బరువుకు, అధిక కొలెస్ట్రాల్‌కు మధ్య సంబంధం లేదు. బక్క పలుచగా ఉన్న వారూ అధిక కొలెస్ట్రాల్
కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి.
- గత 40 ఏళ్లలో భారతీయులకు గుండెజబ్బులు రావడం నాలుగు రెట్లు పెరిగింది.
- 2030 నాటికి దేశంలో సంభవించే మరణాల్లో అత్యధికం గుండెజబ్బుల కారణంగానే ఉంటాయి.
- 2030 నాటికి గుండెజబ్బులతో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు మరణిస్తారని అంచనా.
- రోజుకు కనీసం 45 నిమిషాల నడక ఆయుష్షును 8 నుంచి పదేళ్లు ఎక్కువ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment