సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని రాచనగరి మైసూరులో ఏటా నిర్వహించే ప్రపంచ ప్రఖ్యాత దసరా జంబూ సవారీ శనివారం అంగరంగవైభవంగా జరగనుంది. ఈమేరకు కర్ణాటక ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జంబూ సవారీని వీక్షించేందుకు దాదాపు ఐదు లక్షల మంది పర్యాటకులు వస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో శుభ మకరలగ్నంలో అంబా విలాస్‌లోని బలరామ ద్వారం వద్ద ఉన్న నంది ధ్వజానికి పూజలు నిర్వహించడం ద్వారా జంబూ సవారీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం ప్యాలెస్‌లో స్వర్ణ అంబారీకి పూజలు నిర్వహించిన తర్వాత సాయంత్రం 4.45 గంటలకు కుంభలగ్నంలో జంబూ సవారీ ప్రారంభం కానుంది.
అమ్మలగన్న అమ్మ చాముండేశ్వరీ దేవి స్వర్ణ అంబారీలో కొలువై ఉండగా 750 కేజీల ఆ స్వర్ణ అంబారీని మోసే బాధ్యత ఈ ఏడాది కూడా గజరాజు అర్జుననే వరించింది. అర్జున స్వర్ణ అంబారీని మోయడం వరుసగా ఇది ఆరోసారి. అర్జునతో పాటు మరో 12 గజరాజులు జంబూ సవారీలో పాల్గొననున్నాయి. జంబూ సవారీ ముగిసిన అనంతరం శనివారం సాయంత్రం 8గంటల ప్రాంతంలో బన్ని మంటపంలో కాగడాల కవాతు (టార్చ్‌లైట్ పెరేడ్) నిర్వహించనున్నారు. గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా పెరేడ్ నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. జంబూ సవారీ సాగే మార్గంలో భారీగా భద్రత ఏర్పాటు చేశారు.
ఆకట్టుకున్న ‘ఎయిర్ షో’
దసరా ఉత్సవాల సందర్భంగా శుక్రవారం మైసూరు నగరంలోని దివిటీ కవాతు మైదానంలో వాయుసేన నిర్వహించిన ఎయిర్‌షో అలరించింది. సైనికులు నిర్వహించిన అత్యంత సాహసోపేతమైన విన్యాసాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. వాయిసేన నిర్వహించిన రోస్ పెట్టల్ డ్రాప్, స్లిథరింగ్, స్కైడైవ్ సాహస విన్యాసాలు అబ్బురపరిచాయి. ఏడు వేల అడుగుల ఎత్తు నుంచి ప్యారాచూట్‌ల ద్వారా నేలపైకి దిగిన విన్యాసాలను ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూశారు.