‘దసరా వచ్చింది... సరదా తెచ్చింది’ అంటూ... ఆడుతూ పాడుతూ చేసుకునే పండగ ఇది. దసరా మనదేశమంతటికీ పండగే. ఎవరు ఎలా వేడుక చేసుకున్నా సరే... అన్ని వేడుకల అంతరార్థం ఒక్కటే.
చెడు మీద మంచి సాధించిన విజయం. మంచి–చెడులకు ప్రాంత – మత భేదాలుండవు. చెడు మీద సాగే పోరుకు కూడా ఆ తేడాలుండవు. అందుకే... ఇది సంస్కృతిలో భాగమైపోయింది. అందరూ కలిసి చేసుకునే వేడుక అయింది.
సంబరాల ఊరేగింపు
దక్షిణాది వాళ్లకు దసరా అంటే కర్ణాటక రాష్ట్రం మైసూరు దసరా ఉత్సవాలే గుర్తుకు వస్తాయి. ఈ వేడుకల్లో ఊరేగింపే చాలా పెద్ద ఘట్టం. ఊరేగింపు ప్యాలెస్ నుంచి మొదలై ఆల్బర్ట్ రోడ్, సయాజీ రావు రోడ్, బాంబూ బజార్ మీదుగా బన్ని మంటప మైదానానికి చేరుతుంది. ఊరేగింపు సాగిన ప్రదేశాలన్నీ రకరకాల సంబరాలతో నిండిపోయి ఉంటాయి. మైసూర్ పాలకులు వడయార్‌లు మొదలు పెట్టిన ఈ వేడుకలను ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక్కడ పూజలందుకునే దేవత చాముండేశ్వరీదేవి.
దేశంలో మిగిలిన వేడుకల వలెనే ఈ వేడుకల్లో కూడా స్థానిక సంప్రదాయ కళల ప్రదర్శన ప్రధానంగా ఉంటుంది. ఊరేగింపులో పాల్గొనే ఏనుగులను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఏనుగులతోపాటు గుర్రాలు, ఒంటెల కవాతులు, కళాకారుల విన్యాసాలు ఉంటాయి. మల్లయుద్ధం, సైక్లింగ్ పోటీలు, ఇతర అనేక క్రీడలు, యోగ విన్యా సాలు, పెట్ షోలు, ట్రెజర్ హంట్ ఆటలు, ఫుడ్ స్టాళ్లు ఉంటాయి. బన్ని మంటపానికి పౌరాణిక ప్రాధాన్యం ఉంది. బన్ని చెట్టు అంటే జమ్మిచెట్టు. పాండవులు ఆయుధాలను దాచుకున్న వనం ఇదేనని స్థానికుల విశ్వాసం.
ఈ వేడుకలో కాగడాల కవాతు కూడా చూసి తీరాల్సిన వేడుక. ఈ ఉత్సవాలను చూడడానికి ప్రవేశ రుసుము లేకుండానే అందరికీ అనుమతి ఉంటుంది. అయితే... కాగడాల కవాతును ప్రత్యేక ఆహ్వానితులు, నాలుగు వేలు పెట్టి వి.ఐ.పి గోల్డ్‌కార్డ్ తీసుకున్న వాళ్లు మాత్రమే చూడగలుగుతారు. ఈ కార్డు తీసుకున్న వాళ్ల కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఉంటుంది. వేడుకలను సౌకర్యంగా చూడడానికి వీలుగా ఉంటుంది గ్యాలరీ వ్యూ. లక్ష బల్బులతో వెలిగే ప్యాలెస్, ప్యాలెస్‌లోని దర్బారు హాల్‌లో బంగారు కిరీటాన్ని కూడా చూడవచ్చు. దసరా ఉత్సవాలు జరిగే పది రోజుల పాటూ కిరీటం దర్బారు హాల్‌లోనే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment