మైసూరు, న్యూస్‌లైన్ : ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైసూరు దసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్‌జ మంత్రి వీ శ్రీనివాస్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. వేడుకల ఏర్పాట్లపై మంగళవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకల నిర్వహణకు ఎలాంటి నిధుల కొరత లేదని, ఇప్పటికే రూ.10కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రహదారుల అభివృద్ధికి మరో రూ.ఐదుకోట్ల నిధులను నగరాభివృద్ధి శాఖ కేటాయిస్తుందన్నారు. గతంలో శ్రీరంగ పట్టణంలో దసరా వేడుకలను నిర్వహించేవారని, ఈ ఏడాది రైతుల సృ జనాత్మక దసర వేడుకలను నిర్వహించడంతోపాటు వాటిని చామరాజనగరకు విస్తరింప చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసినందున రైతులు సైతం పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొంటారని, ఏర్పాట్లు ఘనంగా చేయాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినందున ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వరాదన్నారు. వేడుకలకు ముఖ్య అథిదులుగా జ్ఞానపీఠ అవార్డు గ్రహిత డాక్టర్ చంద్రశేఖర కంబార, శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయార్, హై కోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్‌తో పాటు మరి కొంత మంది ప్రముఖులను ఆహ్వానించినట్లు చెప్పారు. ఏనుగు అంబారి సమయంలో రక్షణ కోసం భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించాలన్నారు. ఊరేగింపు సమయంలో సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అయితే వేడుకలకు సంబంధించి మైసూరులో ఫ్లెక్సీలను నిషేధించినట్లు చేప్పారు. సమావేశంలో కలెక్టర్ సి.శిఖా, కన్నడ, సాంస్కృత శాఖ ప్రదాన కార్యదర్శి బసవరాజు, పోలీస్ కమిషనర్ ఎం.ఎ సలీం, ఎస్పీ అభినవ్ ఖరె, మైసూరు పాలికె కమిషనర్ పీజీ రమేష్ పాల్గొన్నారు.
దసరా వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా ఉండాలి
Published Wed, Aug 28 2013 2:57 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
Advertisement