మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న బండారు దత్తాత్రేయ
ఆ దిశగా చట్టాల్లో మార్పులు తెస్తాం: కేంద్రమంత్రి దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా చట్టాల్లో మార్పులు తెస్తామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ (స్వతంత్ర) మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ‘శ్రమయేవ జయతే’ పథకం ద్వారా ప్రతి కార్మికుడికీ న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానని చెప్పారు. సోమవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కార్మిక, ఉపాధి కల్పన మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పేదలు, కార్మికులు, శ్రామికులు, నిరుద్యోగులకు సేవ చేసే అవకాశం కల్పించారంటూ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రయోజనాలను కాపాడుతామన్నారు. అసంఘటిత రంగాల కార్మికుల పీఎఫ్‌ను ఎగవేయడానికి ప్రయత్నిస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ముంబైలో మంగళవారం జరగనున్న కార్మిక సదస్సుకు హాజరవుతున్నట్టు దత్తాత్రేయ చెప్పారు. ఈ సదస్సుకు ఆస్ట్రేలియా కార్మిక మంత్రి కూడా హాజరవుతున్నారని, కార్మిక సంక్షేమంపై ఆయనతో చర్చించనున్నట్టు తెలిపారు.