దావూద్ ఇబ్రహీం (పాత చిత్రం)
న్యూఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుటుంబ సభ్యులకు షాక్ తగిలింది. దావూద్ బంధువుల నుంచి ఆస్తులను స్వాధీన పర్చుకోవాలని భారత ప్రభుత్వానికి సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆస్తులు తమవేనంటూ దావూద్ తల్లి అమీనా బీ, సోదరి హసీనా పర్కార్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ముంబై నాగ్పాదలో దావూద్‌కి చెందిన ఆస్తులు ఉన్నాయి. దేశం విడిచి పారిపోయిన అనంతరం దావూద్ సోదరి, తల్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
అయితే ‘స్మగ్లర్ల ఆస్తుల స్వాధీన చట్టం’ ప్రకారం 1998లో భారత ప్రభుత్వం.. దావూద్ సంబంధీకులు, విదేశీ సన్నిహితుల ఆధీనంలో ఉన్న అతని ఆస్తులను సీజ్ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దావూద్ తల్లి, సోదరి ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు, ట్రిబ్యూనల్ వీరి పిటిషన్‌ని కొట్టేయటంతో చివరకు సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. ఆ ఆస్తులు తమ స్వార్జితమైనవేనని నిరూపించే ఆధారాలను చూపించాలని దావూద్ తల్లిని కోర్టు కోరింది. కానీ వారు సరైన ఆధారాలను ప్రవేశపెట్టలేకపోయారు. పైగా పిటిషనర్లు ఇద్దరూ మరణించటంతో.. ఆస్తుల స్వాధీనానికి లైన్ క్లియర్ అయ్యింది.
వీరిద్దరి పేరిట మొత్తం ఏడు ఆస్తులు ఉన్నాయి. వాటిలో రెండు దావూద్ తల్లీ అమీనా బీ పేరున ఉండగా మిగితా ఐదు అతని సోదరి హసీనా పర్కార్ పేరు మీద ఉన్నాయి. కోట్ల విలువైన ఈ ఆస్తులను అక్రమ సంపాదనతో కొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 1993 ముంబై వరుస పేలుళ్లలో 257 మంది మరణించారు. ఈ పేలుళ్ల వెనక ప్రధాన సూత్రదారి దావూద్ ఇబ్రహీం. ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ దావూద్‌ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment