పంజాబ్లో మరో దుర్ఘటన..
ఖన్నా: పంజాబ్లో మహిళలపై లైంగిక వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. కదులుతున్నబస్సులోంచి 14 బాలికను తోసేసి ఆమె మరణానికి దారితీసిన ఘటనపై రగిలిన దుమారం చల్లారిందో లేదో ఆదివారం మరో సంఘటన వెలుగు చూసింది. తాజాగా పంజాబ్లోని ఖన్నా ఏరియాలో ఒక ప్రయివేటు బస్సులో ప్రయాణిస్తున్న మహిళను పక్కసీట్లో కూర్చున్న వ్యక్తి వేధించడం మొదలుపెట్టాడు. దీంతో తనను వేధిస్తున్నాడంటూ ఆ మహిళ కండక్టర్, డ్రైవర్ సహాయాన్ని కోరింది. అయితే వారు ఆమె అభ్యర్థనను పట్టించుకోలేదు సరికదా, ఆ వ్యక్తి తప్పించుకొని పారిపోవడానికి సహకరించారు. దీంతో హతాశురాలైన బాధితురాలు పోలీసుల హెల్ప్లైన్కు ఫిర్యాదు చేసింది.
తనను వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేసినా బస్సు డ్రైవర్, కండక్టర్ పట్టించుకోలేదని, కనీసం బస్సు కూడా ఆపలేదంటూ బాధితురాలు వాపోతోంది. రంగంలోకి దిగిన పోలీసులు బస్సు డ్రైవర్, కండక్లర్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అసలు నిందితుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న ప్రయివేటు బస్సు యాజమాన్యాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం బంద్కు పిలుపునిచ్చాయి.
కాగా గత బుధవారం గురుద్వారాకు వెళుతున్న తల్లీ కూతుళ్లను వేధించి, బస్సులోంచి నిర్దాక్షిణ్యంగా తోసేసిన ఘటనలో బాలిక ప్రాణాలు కోల్పోతే, తల్లి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. బాలిక మరణానికి కారణమైన ప్రయివేటు రవాణా సంస్థ అధిపతి పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, కొడుకు, ఉపముఖ్యమంత్రి కావడంతో వివాదం మరింత ముదిరింది. అయితే స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగి బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగిన సంగతి తెలిసిందే.