ఆస్పత్రిలో నలుగురు శిశువుల మృతి: నర్సు అరెస్టు | Death of four babies at hospital in Maha: Nurse held | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో నలుగురు శిశువుల మృతి: నర్సు అరెస్టు

Published Wed, May 31 2017 4:18 PM | Last Updated on Fri, May 25 2018 7:06 PM

ఆస్పత్రిలో నలుగురు శిశువుల మృతి: నర్సు అరెస్టు - Sakshi

ఆస్పత్రిలో నలుగురు శిశువుల మృతి: నర్సు అరెస్టు

మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో ఓ ఆస్పత్రిలో పనిచేసే నర్సును పోలీసులు అరెస్టు చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి నలుగురు శిశువుల మరణానికి కారణమైందన్నది ఆమెపై ఉన్న ఆరోపణ. ఇదే కేసులో ఇప్పటికే ఆ ఆస్పత్రిలోనే పనిచేస్తున్న భూషణ్ కట్టా అనే వైద్యుడిని అరెస్టు చేశారు. తాజాగా విద్యా తోరట్ అనే ఈ నర్సును కూడా అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీళ్లిద్దరూ కూడా పంజాబ్‌రావు దేశ్‌ముఖ్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) విభాగంలో పనిచేస్తుంటారు. అక్కడ చిన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందుకే నలుగురు శిశువులు మరణించారని పోలీసులు చెప్పారు.

మెడికల్ కాలేజి, ఆస్పత్రులను శ్రీ శివాజీ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహిస్తుంది. గత వారంలో నెలలు నిండకముందే పుట్టిన నలుగురు పిల్లలను ఇక్కడి ఎన్ఐసీయూలో చేర్చారు. అయితే వారు సోమవారం తెల్లవారుజామున మరణించారు. విద్యా తోరట్ ఆ నలుగురు పిల్లలకు తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిందని అధికారులు అంటున్నారు. పొటాషియం క్లోరైడ్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే పిల్లలు మరణించారన్నారు. చనిపోయిన పిల్లల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే రవి రాణా డిమాండ్ చేశారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం గురించి తాను ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని డివిజనల్ కమిషనర్ జేపీ గుప్తా తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement