థానే: మహాత్మాగాంధీ హత్యతో ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం ఉందని గతంలో తను చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసును కొట్టివేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. శనివారం ఇది జస్టిస్ పీడీ కోడే ఆధ్వర్యంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ కోడే తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 6న రాహుల్ భివాండిలోని సోనాలేలో ఓ సభలో మాట్లాడుతూ... ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారే మహాత్మాగాంధీని హత్య చేశారని వ్యాఖ్యానించారు. దీంతో రాహుల్‌పై ఆర్‌ఎస్‌ఎస్ భివాండి కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేసింది.