సాక్షి, న్యూఢిల్లీ : రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో మైదానాన్ని తెలంగాణ ప్రభుత్వాన్నికి ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. బైసన్ పోలో మైదానంలో సచివాలయం నిర్మించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం స్థలాన్ని అడిగిందని, తమ దగ్గర నుంచి తీసుకున్న భూమికి బదులుగా వేరేచోట భూమి ఇస్తే చాలు అని ఆమె అన్నారు. అయితే బైసన్ పోలో మైదానంపై కొందరు కోర్టుకు వెళ్లారని, కోర్టులో విషయం ఎటూ తేలకముందు తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని, కోర్టు వివాదం సమసిపోయాక స్థలం ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో తమ స్థలాలు ఎక్కడ అడిగినా ఇచ్చేస్తున్నామని తెలిపారు. తమిళనాడులో రక్షణ శాఖ స్థలానికి ఖరీదు కట్టి డబ్బులిస్తామన్నారని, డబ్బుతో తమకు పని కాదని, తీసుకున్న స్థలానికి బదులుగా స్థలమే కావాలని తెలిపారు.
కంటోన్మెంట్ రోడ్లపై..
‘దేశవ్యాప్తంగా 62 కంటోన్మెంట్లలో రహదారుల మూసివేతపై సుదీర్ఘంగా చర్చలు జరిపాం. మాకు అనేక మంది ఎంపీలు ఈ అంశంపై విజ్ఞప్తులు చేశారు. మా పరిశీలనలో మొత్తం మూసేసిన 850 రోడ్లలో 119 రోడ్లను సరైన నిబంధనలు పాటించకుండా మూసేశారని తేలింది. ఎంపీల విజ్ఞప్తుల్లో తప్పు లేదని మాకు అనిపించింది. ఆ రోడ్లను వెంటనే తిరిగి తెరవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం.
ఇందులో 80 రోడ్లు పూర్తిగా తెరుచుకోగా, మరో 15 పాక్షికంగా తెరుచుకున్నాయి. మిగతా 24 రోడ్లు ఇంకా తెరుచుకోలేదు’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు.
Published Tue, Jun 5 2018 7:23 PM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment