Bison Polo Ground
-
సర్వీస్ చార్జీలు ఇస్తే.. మాకు ఓకే!
సాక్షి,హైదరాబాద్: బైసన్‌పోలో మైదానంలో సచివాలయ నిర్మాణంపై మళ్లీ కదలిక మొదలైంది. మంగళవారం హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు రక్షణ శాఖలో కసరత్తు తిరిగి ప్రారంభం కానుంది. కంటోన్మెంట్ ప్రాంతంలోని బైసన్‌పోలో మైదానం ఆవరణలో సచివాలయం నిర్మించినున్నట్లు 2015లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ మేరకు ప్రధానితో పాటు, రక్షణ శాఖ మంత్రిని కలసి సహకరించాల్సిందిగా కోరారు. తదనుగుణంగా భూ బదలాయింపునకు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలపడంతో కంటోన్మెంట్, రక్షణ, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ విభాగాల అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. 60 ఎకరాల పరిధిలోని బైసన్ పోలో, జింఖానా మైదానాలను సచివాలయానికి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను మిలిటరీ అధికారులు అంగీకరించారు. అలాగే ప్యాట్నీ నుంచి హకీంపేట, ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి చెక్‌పోస్టు వరకు రెండు స్కైవేల నిర్మాణానికి మరో 90 ఎకరాలు అవసరం అవుతుందని కమిటీ సర్వేలో తేలింది. 150 ఎకరాల కంటోన్మెంట్ స్థలానికి బదులు మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో ఆర్మీ రైఫిల్ రేంజ్ కోసం 513 ఎకరాలు బదలాయిం చేం దుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సర్వీసు చార్జీలే అడ్డంకి కంటోన్మెంట్ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం వల్ల కంటోన్మెంట్ బోర్డు కోల్పోయే ఆదాయాన్ని సర్వీసు చార్జీల రూపంలో చెల్లించాల్సిందిగా కంటోన్మెంట్ అధికారులు కోరారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అనడంతో బైసన్ పోలో మైదానంలోకి సచివాలయం ఏర్పాటు ప్రతిపాదన అటకెక్కింది. తాజాగా సచివాలయానికి కంటోన్మెంట్ స్థలాల అప్పగింతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణకు హైకోర్టు అంగీకరించడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. సర్వీసు చార్జీల అంశంలో కంటోన్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఏకాభిప్రాయం కుదిరితే సచివాలయం ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయే అవకాశముంది. భూ బదలాయింపుతో పాటు కోరిన మొత్తాన్ని సర్వీసు చార్జీలుగా చెల్లించేందుకు ప్రభుత్వం ఒకే అంటే, భూములు అప్పగించే యోచనలో రక్షణ శాఖ ఉన్నట్లు తెలిసింది. ప్రాథమిక అంగీకారం తెలిపాం కొత్త సచివాలయం నిర్మాణానికి సికింద్రాబాద్, బైసన్‌పోలో గ్రౌండ్‌ను బదలాయించేందుకు ప్రాథమికంగా అంగీకారం తెలిపామని, కొన్ని షరతులు విధించామని కేంద్రం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. ఈ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపాల్సి ఉందని పేర్కొంది. తమ షరతులకు అంగీకారం తెలిపిన తర్వాతే బైసన్‌పోలో గ్రౌండ్ బదలాయింపుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని వివరించింది. ఈ కేసు పెండింగ్‌లో ఉండటం వల్ల బదలాయింపు విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోలేకపోతోందని నివేదించింది. అందువల్ల త్వరితగతిన ఈ కేసులో విచారణ జరపాలని అభ్యర్థించింది. దీంతో ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 12న విచారణ జరుపుతామని, ఈ కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేనందున, ఈ లోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదింపులు, ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బైసన్‌పోలో, జింఖానా మైదానాలను సచివాలయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించకుండా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ డీజీపీ ఎంవీ భాస్కరరావు, మాజీ క్రికెటర్ వివేక్ జయసింహతో పాటు మరో ఇద్దరు 2017లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే అంశంపై జి.కరుణాకర్ అనే వ్యక్తి కూడా ఆ తర్వాత పిల్ దాఖలు చేశారు. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు.. మంగళవారం మరోసారి విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సునీల్ బి.గాను, వీవీఎన్ నారాయణరావులు వాదనలు వినిపిస్తూ.. 2017లో ఈ వ్యాజ్యాలు దాఖలు చేశామని, ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతోందని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు కూడా లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. సచివాలయ నిర్మాణం కోసం బైసన్‌పోలో గ్రౌండ్‌ను బదలాయించేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) కె.లక్ష్మణ్ స్పందిస్తూ.. బైసన్‌పోలో గ్రౌండ్ బదలాయింపు విషయంలో ప్రాథమిక అంగీకారం తెలిపిన మాట వాస్తవమేనని, అయితే ఇదే సమయంలో కొన్ని షరతులు కూడా విధించామని తెలిపారు. ఈ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ షరతులకు అంగీకారం తెలిపిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. -
బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వడానికి సిద్ధమే!
సాక్షి, న్యూఢిల్లీ : రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో మైదానాన్ని తెలంగాణ ప్రభుత్వాన్నికి ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. బైసన్ పోలో మైదానంలో సచివాలయం నిర్మించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం స్థలాన్ని అడిగిందని, తమ దగ్గర నుంచి తీసుకున్న భూమికి బదులుగా వేరేచోట భూమి ఇస్తే చాలు అని ఆమె అన్నారు. అయితే బైసన్ పోలో మైదానంపై కొందరు కోర్టుకు వెళ్లారని, కోర్టులో విషయం ఎటూ తేలకముందు తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని, కోర్టు వివాదం సమసిపోయాక స్థలం ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో తమ స్థలాలు ఎక్కడ అడిగినా ఇచ్చేస్తున్నామని తెలిపారు. తమిళనాడులో రక్షణ శాఖ స్థలానికి ఖరీదు కట్టి డబ్బులిస్తామన్నారని, డబ్బుతో తమకు పని కాదని, తీసుకున్న స్థలానికి బదులుగా స్థలమే కావాలని తెలిపారు. కంటోన్మెంట్ రోడ్లపై.. ‘దేశవ్యాప్తంగా 62 కంటోన్మెంట్లలో రహదారుల మూసివేతపై సుదీర్ఘంగా చర్చలు జరిపాం. మాకు అనేక మంది ఎంపీలు ఈ అంశంపై విజ్ఞప్తులు చేశారు. మా పరిశీలనలో మొత్తం మూసేసిన 850 రోడ్లలో 119 రోడ్లను సరైన నిబంధనలు పాటించకుండా మూసేశారని తేలింది. ఎంపీల విజ్ఞప్తుల్లో తప్పు లేదని మాకు అనిపించింది. ఆ రోడ్లను వెంటనే తిరిగి తెరవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం. ఇందులో 80 రోడ్లు పూర్తిగా తెరుచుకోగా, మరో 15 పాక్షికంగా తెరుచుకున్నాయి. మిగతా 24 రోడ్లు ఇంకా తెరుచుకోలేదు’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు. -
కొత్త సచివాలయానికి మరో మెలిక
► మైదానం ఇవ్వొద్దంటూ పీఎంవోకు ఫిర్యాదులు ► దాంతో రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరిన వైనం ► ప్రత్యామ్నాయంగా 543 ఎకరాలివ్వాలని షరతు ► రూ. 1,100 కోట్లు, ► ఏటా నిర్వహణ చార్జీలూ ► చెల్లించాలని కొర్రీ సాక్షి, హైదరాబాద్ : కొత్త సచివాలయ నిర్మాణానికి మరో మెలిక పడింది. సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో గ్రౌండ్‌ను అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తోంది. మైదానం ఇవ్వొద్దంటూ ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం గ్రీవెన్స్ సెల్‌కు కొంతకాలంగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వాటిలో 13 ఫిర్యాదులకు వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి పీఎంవో తాజాగా లేఖ రాసింది. దీంతో కేంద్రానికి వివరణ ఇచ్చేందుకు రహదారులు, భవనాల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలూ రక్షణ శాఖ భూములివ్వాలని ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు భూములిస్తే.. మిగిలిన రెండు రాష్ట్రాలకూ ఇవ్వాల్సి ఉంటుందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగానే కేంద్రం పెండింగ్‌లో పెడుతోందని ప్రభుత్వ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త షరతులు, రకరకాల కొర్రీలు తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. భూములిచ్చేందుకు గతేడాది ఓకే బైసన్ పోలోతో పాటు జింఖానా గ్రౌండ్‌కు చెందిన 60.87 ఎకరాలు.. జాతీయ, రాష్ట్ర రహదారుల విస్తరణ, గఫ్ రోడ్డుకు ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి 200.58 ఎకరాల భూమి అప్పగించాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరుతోంది. ప్రత్యామ్నాయంగా జవహర్‌నగర్‌లో 500 ఎకరాల భూమి కేటాయించడంతోపాటు మౌలిక సౌకర్యాలు కల్పించే ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రతిపాదనలపై రక్షణ శాఖ ఇప్పటికే రాష్ట్ర అధికారులతో ఢిల్లీలో ఓసారి సమావేశమైంది. హైదరాబాద్‌కు వచ్చి భూములను సైతం పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు భూములు అప్పగించేందుకు గతేడాది నవంబర్లోనే సంసిద్ధత వ్యక్తం చేసింది. వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలుగా నాన్చివేత «ధోరణి అనుసరించిన రక్షణ శాఖ.. ఇటీవలే కొన్ని షరతులు విధించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 500 ఎకరాలు సరిపోదని, 543 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని, దాదాపు రూ. 1,100 కోట్లు చెల్లించాలని షరతు విధించినట్లు తెలిసింది. వీటితో పాటు నిర్వహణ పేరుతో ఏటా చార్జీలు చెల్లించాలని మరో మెలిక పెట్టినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అంత మొత్తం చెల్లించి భూములు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అంచనాలు వేసుకుంటోంది. నిధులు చెల్లించేందుకు సిద్ధపడినా ఏటా నిర్వహణ చార్జీలు చెల్లించాలంటూ రక్షణ శాఖ పెట్టిన షరతులు అనుచితంగా ఉన్నాయని వెనుకడుగేసింది. అందుకే కొత్త సచివాలయం నిర్మాణాన్ని కొంతకాలం వాయిదా వేయాలని సూచనప్రాయంగా నిర్ణయించింది. కేంద్రం నుంచి సానుకూలత వచ్చే వరకు తొందరేమీలేదని ఈ విషయాన్ని అధికారులు తేలిగ్గా తోసిపుచ్చుతున్నారు. -
'సచివాలయం తరలిస్తే ఒప్పుకోం'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని సికింద్రాబాద్ లోని బైసన్ పోలో గ్రౌండుకు మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కావడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని దుయ్యబట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు బుధవారం బైసన్ పోలో మైదానం సందర్శించారు. రాష్ట్ర సచివాలయాన్ని బైసన్ పోలో గ్రాండుకు మార్చాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ నాయకులు అక్కడే బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. కొత్త సచివాలయం పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సచివాలయం తరలించడం పిచ్చి తుగ్లక్ చర్యగా వారు దుయ్యబట్టారు. అనేక దశాబ్దాలపాటు కోట్లాది ప్రజలకు సేవలు అందించిన ప్రస్తుత సచివాలయం తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించడానికి పనికిరాదా అని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ప్రజలకు అందుబాటులో ఉన్న సచివాలయ తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండగా వాటిని పక్కన పెట్టి కేవలం సచివాలయం గురించి మాత్రమే ఢిల్లీలో ప్రయత్నాలు చేయడం, విభజన చట్టంలో ఇచ్చిన హక్కులను పట్టించుకోకపోవడం దారుణమని ఉత్తమ్ పేర్కొన్నారు. బైసన్ పోలో భూమిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని, కానీ ఇందులో సచివాలయం నిర్మించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. ప్రజావసరాల కోసం భూమిని ఉపయోగించాలని సూచించారు. కేసిఆర్ రాచరిక పాలన అమలు చేస్తున్నారని, ఇప్పటికే రాష్ట్రంలో రూ.73 వేల కోట్ల అప్పులున్నాయని షబ్బీర్ అలీ విమర్శించారు. బైసన్‌పోలో గ్రౌండ్లో సచివాలయ నిర్మాణం సమర్థనీయం కాదని వీహెచ్ అన్నారు. తాము వ్యతిరేకించడమే కాదు అడ్డుకుంటామన్నారు. -
‘బైసన్ పోలో’కు ఓకే
రక్షణ భూములిచ్చేందుకు ప్రధాని అంగీకారం: సీఎం కేసీఆర్ సాక్షి, న్యూఢిల్లీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బైసన్ పోలో గ్రౌండ్స్ సహా రక్షణ శాఖకు చెందిన స్థలాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ అంగీకారం తెలిపారు. ఈ మేరకు అవసరమైన అనుమతుల ప్రక్రియను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయించే బాధ్యత తనదంటూ ప్రధాని హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. బుధవారం ఆయన పార్లమెంట్లో ప్రధానితో భేటీ అయ్యారు. అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. ఆరు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘దీనిపై మీ పత్రికలు రాస్తున్నాయి తప్ప.. మేం అంత సీరియస్‌గా లేం. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఉన్నందున మిగిలిన అంశాలతోపాటు దాన్ని కూడా అమలు చేయాలని కోరాం. అమలైతే సంతోషిస్తాం..’’అని అన్నారు. ‘‘సెక్రటేరియట్ తదితర అవసరాల కోసం రక్షణ శాఖ భూములు అడిగాం. ఈ స్థలం కేవలం సచివాలయానికి మాత్రమే అన్న ప్రచారం జరుగుతోంది. అది అర్థ సత్యమే. రాజీవ్ రహదారి, మేడ్చల్ హైవే తదితర అంశాలతో ఈ స్థలం ముడివడి ఉంది. పీవీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే తరహాలో రాజధాని నుంచి కరీంనగర్ తదితర ప్రాంతాలకు వెళ్లే రోడ్లపై కొత్త రహదారులను నిర్మించాలనేది మా ప్రణాళిక. అయితే ఈ స్థలం అంతా కంటోన్మెంట్లో ఉంది..’’అని ఆయన వివరించారు. ‘‘వరల్డ్ ఇన్వెస్టర్స్ మీట్ హైదరాబాద్‌లో జరగనుంది. దీనికి రావాలని ప్రధానిని ఆహ్వానించా. ఇంకా తేదీలు ఖరారు కాలేదు. దీనికి తప్పనిసరిగా వస్తానని ప్రధాని హామీ ఇచ్చారు. అలాగే రైతుల సమస్యలపై మాట్లాడా. రిజర్వేషన్ల విషయం మాట్లాడా. బీసీ, ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంపై చర్చించాను. ప్రధాని ఇంతకుముందే దీనిపై సానుకూలత వ్యక్తం చేశారు. మరోసారి సమగ్రంగా చర్చిద్దామని చెప్పారు. హైకోర్టు గురించి కూడా చర్చించాను. సాధ్యమైనంత త్వరగా విభజించాలని కోరాను..’’ అని సీఎం వివరించారు. చివరి అంశంగా నియోజకవర్గాల పునర్విభజన హామీని కూడా అమలు చేయాలని కోరినట్లు సీఎం తెలిపారు. అయితే ఈ అంశంపై ప్రధాని నుంచి సానుకూల స్పందన రాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. జైట్లీ దృష్టికి జీఎస్టీ ఇబ్బందులు అంతకుముందు సీఎం కేసీఆర్ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో పార్లమెంటులో భేటీ అయ్యారు. జీఎస్టీ అమలులో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను జైట్లీ దృష్టికి తెచ్చారు. ఆ వివరాలను ఎంపీ వినోద్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. ముఖ్యంగా జీఎస్టీ నుంచి గ్రానైట్ పరిశ్రమను మినహాయించాలని కోరినట్టు ఆయన తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన రూ.450 కోట్లు త్వరగా విడుదల చేయాలని కోరినట్టు వివరించారు. ‘‘మిషన్ భగీరథ, జల వనరుల శాఖకు సంబంధించిన పలు ఆర్థిక అంశాలను కూడా సీఎం ప్రస్తావించారు’’అని వినోద్ తెలిపారు. -
పెరేడ్ గ్రౌండ్ సేఫ్..!
పెరేడ్ గ్రౌండ్‌ను ప్రభుత్వం తీసుకుంటుందని, దాంతో అది అదృశ్యం అవుతుందంటూ వచ్చిన కథనాలను సీఎం కేసీఆర్ ఖండించారు. తాము తీసుకుంటున్నది బైసన్ పోలో గ్రౌండ్ తప్ప పెరేడ్ గ్రౌండ్ కాదని చెప్పారు. అందులో మొత్తం సుమారు 55-60 ఎకరాల స్థలం ఉందని, అక్కడ మంచి సెక్రటేరియట్, అసెంబ్లీ భవనంతో పాటు తెలంగాణ కళాభారతిని కూడా నిర్మిస్తామని, ఆ మూడింటి ఎదురుగానే పెద్ద ఖాళీ స్థలం ఉంటుందని, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ అక్కడే బ్రహ్మాండంగా జరుపుకోవచ్చని తెలిపారు. అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ అని చెబుతారని, కానీ ఇన్నాళ్లుగా ఒక్క పెరేడ్ గ్రౌండ్ కూడా లేకపోవడం దౌర్భాగ్యమని కేసీఆర్ అన్నారు. ఇప్పటివరకు ఉన్నదాని కోసం ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి వాళ్ల గడ్డం పట్టుకుని బతిమాలి గానీ, పైరవీలు చేసి గానీ అనుమతులు తెచ్చుకోవాల్సి వచ్చేదన్నారు. ఒక్కోసారి వాళ్లు అనుమతులు కూడా నిరాకరించేవారని చెప్పారు. అందుకే తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా ఉండేలా హైదరాబాద్ నగరానికి ఐకానిక్‌గా ఉండే విధంగా అసెంబ్లీ, సెక్రటేరియట్, కళాభారతి మూడింటినీ ఒకేచోట నిర్మిస్తామని చెప్పారు. ఇందుకోసం పెరేడ్ గ్రౌండ్‌ను మాత్రం తీసుకోవడం లేదని, అది అలాగే ఉండాలని.. అక్కడ కుర్రాళ్లు ఆడుకోవాలని ఆయన అన్నారు. -
బైసన్ పోలో గ్రౌండ్ అప్పగింత
► రాష్ట్ర ప్రభుత్వ వినతికి రక్షణ శాఖ అంగీకారం! ► కొత్త సచివాలయ నిర్మాణానికి కోరిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్ నూతన సచివాలయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు స్థలాల అప్పగింతకు రక్షణ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. రక్షణ శాఖ అధీనంలో ఉన్న సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో గ్రౌండ్లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్న విషయం తెలిసిందే. బైసన్ గ్రౌండ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు కూడా ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయంగా సైనికావసరాలకు కావాల్సినంత భూమిని నగర శివార్లలో కేటాయిస్తామంటూ ప్రతిపాదనలు సమర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, జింఖానా గ్రౌండ్స్, బైసన్ పోలో గ్రౌండ్స్ పరిసరాల్లో దాదాపు 170 ఎకరాల విస్తీర్ణంలో రక్షణ శాఖ భూములున్నాయి. సచివాలయ నిర్మాణానికి వాటిలో దాదాపు 60 ఎకరాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు రక్షణ శాఖకు లేఖలు రాసింది. దీనిపై సీఎంతో పాటు ఉన్నతాధికారులు రక్షణ మంత్రిని, సంబంధిత అధికారులను పలుమార్లు కలిశారు. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత స్థలాన్ని కేటాయించేందుకు రక్షణ శాఖ గురువారం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే ఈ మేరకు తమకు అధికారిక సమాచారం రాలేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి, ప్యారడైజ్ నుంచి షామీర్పేట్ దాకా తలపెట్టిన ఎలివేటేడ్ కారిడార్లకు అవసరమైన స్థలాలను కేటాయించేందుకు రక్షణ శాఖ ఇప్పటికే అంగీకరించడం తెలిసిందే. పారడైజ్ నుంచి బోయిన్పల్లి సమీపంలోని సుచిత్ర జంక్షన్ దాకా రోడ్డు నిర్మాణానికి 5.5 కి.మీ., పారడైజ్ నుండి షామీర్పేట్ దాకా 18.3 కి.మీ. ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి 99 ఎకరాలను అప్పగించనుంది. ప్రత్యామ్నాయంగా వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో ఫైరింగ్ రేంజ్‌కు 100 ఎకరాలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వెలిబుచ్చింది. రక్షణ శాఖ అధికారులు ఆ భూములను పరిశీలించి శాఖకు నివేదిక సమర్పించారు కూడా.