'సచివాలయం తరలిస్తే ఒప్పుకోం'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని సికింద్రాబాద్ లోని బైసన్ పోలో గ్రౌండుకు మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కావడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని దుయ్యబట్టింది.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు బుధవారం బైసన్ పోలో మైదానం సందర్శించారు. రాష్ట్ర సచివాలయాన్ని బైసన్ పోలో గ్రాండుకు మార్చాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ నాయకులు అక్కడే బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. కొత్త సచివాలయం పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సచివాలయం తరలించడం పిచ్చి తుగ్లక్ చర్యగా వారు దుయ్యబట్టారు. అనేక దశాబ్దాలపాటు కోట్లాది ప్రజలకు సేవలు అందించిన ప్రస్తుత సచివాలయం తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించడానికి పనికిరాదా అని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు.
హైదరాబాద్ నగర నడిబొడ్డున ప్రజలకు అందుబాటులో ఉన్న సచివాలయ తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండగా వాటిని పక్కన పెట్టి కేవలం సచివాలయం గురించి మాత్రమే ఢిల్లీలో ప్రయత్నాలు చేయడం, విభజన చట్టంలో ఇచ్చిన హక్కులను పట్టించుకోకపోవడం దారుణమని ఉత్తమ్ పేర్కొన్నారు. బైసన్ పోలో భూమిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని, కానీ ఇందులో సచివాలయం నిర్మించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. ప్రజావసరాల కోసం భూమిని ఉపయోగించాలని సూచించారు.
కేసిఆర్ రాచరిక పాలన అమలు చేస్తున్నారని, ఇప్పటికే రాష్ట్రంలో రూ.73 వేల కోట్ల అప్పులున్నాయని షబ్బీర్ అలీ విమర్శించారు. బైసన్‌పోలో గ్రౌండ్‌లో సచివాలయ నిర్మాణం సమర్థనీయం కాదని వీహెచ్ అన్నారు. తాము వ్యతిరేకించడమే కాదు అడ్డుకుంటామన్నారు.