‘బైసన్ పోలో’కు ఓకే
రక్షణ భూములిచ్చేందుకు ప్రధాని అంగీకారం: సీఎం కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బైసన్ పోలో గ్రౌండ్స్ సహా రక్షణ శాఖకు చెందిన స్థలాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ అంగీకారం తెలిపారు. ఈ మేరకు అవసరమైన అనుమతుల ప్రక్రియను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయించే బాధ్యత తనదంటూ ప్రధాని హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. బుధవారం ఆయన పార్లమెంట్‌లో ప్రధానితో భేటీ అయ్యారు. అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. ఆరు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘దీనిపై మీ పత్రికలు రాస్తున్నాయి తప్ప.. మేం అంత సీరియస్‌గా లేం. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఉన్నందున మిగిలిన అంశాలతోపాటు దాన్ని కూడా అమలు చేయాలని కోరాం. అమలైతే సంతోషిస్తాం..’’అని అన్నారు.
‘‘సెక్రటేరియట్ తదితర అవసరాల కోసం రక్షణ శాఖ భూములు అడిగాం. ఈ స్థలం కేవలం సచివాలయానికి మాత్రమే అన్న ప్రచారం జరుగుతోంది. అది అర్థ సత్యమే. రాజీవ్ రహదారి, మేడ్చల్ హైవే తదితర అంశాలతో ఈ స్థలం ముడివడి ఉంది. పీవీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే తరహాలో రాజధాని నుంచి కరీంనగర్ తదితర ప్రాంతాలకు వెళ్లే రోడ్లపై కొత్త రహదారులను నిర్మించాలనేది మా ప్రణాళిక. అయితే ఈ స్థలం అంతా కంటోన్మెంట్‌లో ఉంది..’’అని ఆయన వివరించారు. ‘‘వరల్డ్ ఇన్వెస్టర్స్ మీట్ హైదరాబాద్‌లో జరగనుంది. దీనికి రావాలని ప్రధానిని ఆహ్వానించా. ఇంకా తేదీలు ఖరారు కాలేదు. దీనికి తప్పనిసరిగా వస్తానని ప్రధాని హామీ ఇచ్చారు. అలాగే రైతుల సమస్యలపై మాట్లాడా. రిజర్వేషన్ల విషయం మాట్లాడా. బీసీ, ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంపై చర్చించాను. ప్రధాని ఇంతకుముందే దీనిపై సానుకూలత వ్యక్తం చేశారు. మరోసారి సమగ్రంగా చర్చిద్దామని చెప్పారు. హైకోర్టు గురించి కూడా చర్చించాను. సాధ్యమైనంత త్వరగా విభజించాలని కోరాను..’’ అని సీఎం వివరించారు. చివరి అంశంగా నియోజకవర్గాల పునర్విభజన హామీని కూడా అమలు చేయాలని కోరినట్లు సీఎం తెలిపారు. అయితే ఈ అంశంపై ప్రధాని నుంచి సానుకూల స్పందన రాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
జైట్లీ దృష్టికి జీఎస్టీ ఇబ్బందులు
అంతకుముందు సీఎం కేసీఆర్ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో పార్లమెంటులో భేటీ అయ్యారు. జీఎస్టీ అమలులో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను జైట్లీ దృష్టికి తెచ్చారు. ఆ వివరాలను ఎంపీ వినోద్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. ముఖ్యంగా జీఎస్టీ నుంచి గ్రానైట్ పరిశ్రమను మినహాయించాలని కోరినట్టు ఆయన తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన రూ.450 కోట్లు త్వరగా విడుదల చేయాలని కోరినట్టు వివరించారు. ‘‘మిషన్ భగీరథ, జల వనరుల శాఖకు సంబంధించిన పలు ఆర్థిక అంశాలను కూడా సీఎం ప్రస్తావించారు’’అని వినోద్ తెలిపారు.