బైసన్ పోలో గ్రౌండ్ అప్పగింత
► రాష్ట్ర ప్రభుత్వ వినతికి రక్షణ శాఖ అంగీకారం!
► కొత్త సచివాలయ నిర్మాణానికి కోరిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్
నూతన సచివాలయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు స్థలాల అప్పగింతకు రక్షణ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. రక్షణ శాఖ అధీనంలో ఉన్న సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో గ్రౌండ్‌లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్న విషయం తెలిసిందే. బైసన్ గ్రౌండ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు కూడా ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయంగా సైనికావసరాలకు కావాల్సినంత భూమిని నగర శివార్లలో కేటాయిస్తామంటూ ప్రతిపాదనలు సమర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, జింఖానా గ్రౌండ్స్, బైసన్ పోలో గ్రౌండ్స్ పరిసరాల్లో దాదాపు 170 ఎకరాల విస్తీర్ణంలో రక్షణ శాఖ భూములున్నాయి. సచివాలయ నిర్మాణానికి వాటిలో దాదాపు 60 ఎకరాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు రక్షణ శాఖకు లేఖలు రాసింది. దీనిపై సీఎంతో పాటు ఉన్నతాధికారులు రక్షణ మంత్రిని, సంబంధిత అధికారులను పలుమార్లు కలిశారు.
ఈ నేపథ్యంలో ప్రతిపాదిత స్థలాన్ని కేటాయించేందుకు రక్షణ శాఖ గురువారం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే ఈ మేరకు తమకు అధికారిక సమాచారం రాలేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్‌పల్లి, ప్యారడైజ్ నుంచి షామీర్‌పేట్ దాకా తలపెట్టిన ఎలివేటేడ్ కారిడార్లకు అవసరమైన స్థలాలను కేటాయించేందుకు రక్షణ శాఖ ఇప్పటికే అంగీకరించడం తెలిసిందే. పారడైజ్ నుంచి బోయిన్‌పల్లి సమీపంలోని సుచిత్ర జంక్షన్ దాకా రోడ్డు నిర్మాణానికి 5.5 కి.మీ., పారడైజ్ నుండి షామీర్‌పేట్ దాకా 18.3 కి.మీ. ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి 99 ఎకరాలను అప్పగించనుంది. ప్రత్యామ్నాయంగా వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో ఫైరింగ్ రేంజ్‌కు 100 ఎకరాలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వెలిబుచ్చింది. రక్షణ శాఖ అధికారులు ఆ భూములను పరిశీలించి శాఖకు నివేదిక సమర్పించారు కూడా.