సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో పోటీ చేయబోనని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన ఉందా అంటూ ఓ టీవీ చానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ‘ఢిల్లీవాసుల నుంచి నాకు జవాబు లభించింది. ఢిల్లీ రూపురేఖలను మార్చలేరు. మీరు బయటకు వెళాల్ల్సిన తరుణం ఆసన్నమైందని వారు స్పష్టం చేశారు’ అని తెలిపారు. నగరవాసులు నాయకత్వ మార్పు కోరుకుంటున్నారన్నారు. కాగా గత విధానసభ ఎన్నికల్లో షీలా దీక్షిత్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 25 వేలకు పైగా ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయిన సంగతి విదితమే.
ప్రజలు తన తలరాతను నిర్ణయించారని, తాను దానిని అంగీకరించానని చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసినప్పటికీ అందుకు తగిన గుర్తింపు లభించలేదన్నారు. ఢిల్లీ రాజకీయాలనుంచి బయటపడ్డానని, ఎన్నికలలో పోటీచేయాలన్న ఆసక్తి తనకు లేదన్నారు.ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కూడా తనకు ఎలాంటి పాత్ర అప్పగించలేదని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి తాను మద్దతు ఇస్తానని, పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తానని తెలిపారు. ఢిల్లీలో రాజకీయ గందరగోళానికి ఆమ్ ఆద్మీ పార్టీయేనని షీలా అభిప్రాయపడ్డారు. అరవింద్ అబద్ధపు హామీలతో ప్రజలను తప్పుదారిపట్టించారని ఆరోపించారు.
ఆప్ విన్నపం మేరకు తాము మద్దతు ఇచ్చామని, అయినప్పటికీ సమర్థంగా పనిచేయలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల గురించి మాట్లాడుతూ ఆప్, బీజేపీ ఇప్పటికే ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టాయని, అయితే తమ పార్టీ ఇంకా ఆ దిశగా అడుగులు వేయాల్సి ఉందన్నారు. గత ఎన్నికలలో పరాజయం తరువాత పార్టీ గుణపాఠం నేర్చుకుందని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సమష్టి నాయకత్వం కింద పనిచేస్తుందన్నారు. కాగా తాను విధానసభ ఎన్నికల బరిలోకి దిగబోనంటూ షీలాదీక్షిత్ ప్రకటించడం ఢిల్లీ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నవారందరికీ నిరాశ కలిగించింది.
విధానసభ ఎన్నికల బరిలో దిగను
Published Wed, Nov 5 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement