not contest polls
-
గులాంనబీ రాజకీయ అస్త్రసన్యాసం
జమ్మూ: మాజీ కేంద్ర మంత్రి, జమ్మూకాశ్మీర్ సీనియర్ రాజకీయ వేత్త గులాంనబీ ఆజాద్ రాజకీయ అస్త్ర సన్యాసం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆజాద్ బుధవారం(ఏప్రిల్17) ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో తన పార్టీ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏపీ) తరపున జమ్మూకాశ్మీర్ అనంత్‌నాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనన్నట్లు ఆజాద్ ఇటీవల ప్రకటించారు. ఇంతలోనే పోటీ నుంచి తప్పుకున్నట్లు ఆయన ప్రకటించడం చర్చనీయాంశమైంది. అనంత్‌నాగ్ నుంచి పీడీపీ పార్టీ తరపున మహబూబా ముఫ్తీ పోటీ చేస్తుండగా ఇండియా కూటమి తరపున నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత అల్తాఫ్ అహ్మద్ బరిలో ఉన్నారు. ఇదీ చదవండి.. సెల్‌ఫోన్ బిల్లు నెలకు రూ.5 వేలు.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు -
రాజకీయాలకు గుడ్‌బై బీజేపీ ఎంపీ హర్షవర్ధన్
న్యూఢిల్లీ: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగనున్న అభ్యర్థుల తొలిజాబితాను బీజేపీ ప్రకటించిన మరుసటి రోజే రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్.హర్షవర్ధన్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పరిధిలోని చాంద్‌నీచౌక్ స్థానం నుంచి సిట్టింగ్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. శనివారం బీజేపీ విడుదలచేసిన తొలి జాబితాలో ఈయన పేరు లేదు. అందుకే ఈయన రాజకీయాలను వదిలేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ‘‘ 50 ఏళ్ల క్రితం కాన్పూర్‌లో ఎంబీబీఎస్‌లో చేరా. పేదలకు సేవచేశా. 30 ఏళ్ల పైబడిన రాజకీయ జీవితంలో ఐదు సార్లు శాసనసభ, రెండు సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచా. మళ్లీ ఇన్నాళ్లకు నా మూలాల్లోకి వెళ్లిపోతా’’ అన్నారు. ఢిల్లీ పరిధిలో నలుగురు సిట్టింగ్ ఎంపీలు పర్వేశ్ శర్మ, రమేశ్ బిధూరి, మీనాక్షి లేఖీ, హర్‡్షవర్ధన్లను కాదని కొత్త వారికి బీజేపీ అవకాశమిస్తూ వారి పేర్లను తొలి అభ్యర్థుల జాబితాల చేర్చడం తెల్సిందే. నేను పోటీచేయలేను: పవన్ సింగ్ పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ ఎంపీ స్థానం నుంచి తనను బీజేపీ అభ్యరి్థగా నిలబెట్టినప్పటికీ తాను మాత్రం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ నేత పవన్ సింగ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ‘‘ నేనైతే పోటీ నుంచి వైదొలగుతున్నా. ఎందుకు పోటీ చేయట్లేను అనే కారణాలను వెల్లడించలేను’ అని భోజ్‌పురీ గాయకుడు, నటుడు అయిన పవన్ సింగ్ స్పష్టంచేశారు. అసన్సోల్లో బీజేపీ ముందే ఓడిందంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవాచేసింది. -
Nagaland election: ఆకాశంలో సగమైనా... నాగాలాండ్‌లో మాత్రం శూన్యం
ఎస్.రాజమహేంద్రారెడ్డి: ఆమె. ఎందులోనూ తక్కువ కాదు. ఆకాశంలో సగం. అన్నింటా కూడా సగం. ఇంటికే పరిమితమనేది గతించిన మాట. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా, ధాటిగా తనను తాను నిరూపించుకుంటోంది. మహిళలు అన్ని రంగాల్లోనూ గణనీయమైన పురోగతి సాధిస్తున్నారు. కానీ నాగాలాండ్‌లో మాత్రం మహిళలు ఒక విషయంలో మరీ వెనకబడ్డారు. ఇక్కడా తప్పు వారిది కాదు... అక్కడి పురుషాధిక్య సమాజానిది. ఆ రాష్ట్రంలో చదువులో, ఉద్యోగాల్లో లేని కట్టుబాటు రాజకీయాలకు వచ్చేసరికి మాత్రం పెద్ద అడ్డుకట్టగా మారింది. నాగాలాండ్ శాసనసభకు ఇప్పటిదాకా ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు! నాగాలాండ్ 1963లో రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఇప్పటిదాకా శాసనసభకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ 13 సభల్లోనూ మహిళలకు అసలే ప్రాతినిధ్యం దక్కలేదు. 13 ఎన్నికల్లోనూ బరిలో దిగిన మహిళల సంఖ్య కేవలం 20 మాత్రమే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా ఐదుగురు మహిళలు పోటీ చేశారు. కానీ వీరిలో ముగ్గురికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఓవరాల్‌గా ఇప్పటిదాకా బరిలో దిగిన 20 మందిలో చాలామంది మహిళలకూ అదే ఫలితం దక్కింది! మహిళలు ప్రధాని అవడమే గాక ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టిన మన దేశంలో ఒక్క నాగాలాండ్‌లోనే ఎందుకీ దుస్థితి? అక్కడేమన్నా అక్షరాస్యత తక్కువగా ఉందా అంటే, ఆ సమస్యే లేదు. రాష్ట్రంలో మహిళల్లో కూడా అక్షరాస్యత ఏకంగా 76.11 శాతం. ఇది దేశ సగటు అక్షరాస్యత (64.6 శాతం) కన్నా ఎక్కువ. ఇంత అక్షరాస్యత ఉన్నా నాగా మహిళలు సాటి మహిళలకు ఓటేసేందుకు సుముఖంగా లేరు! రాష్ట్ర మొత్తం ఓటర్ల సంఖ్య 13.17 లక్షలు. వీరిలో మహిళా ఓటర్ల సంఖ్య దాదాపు సగం, అంటే 6.56 లక్షలు. అయినా ఎందుకీ చిన్నచూపు? ఎందుకీ వివక్ష? స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2017లో నాగాలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమై నిరసనలు, ఆందోళనల దాకా వెళ్లింది! అక్కడ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యంపై ఎంత వ్యతిరేక భావన ఉందో దీన్నిబట్టే అర్థమవుతోంది. ఈ రిజర్వేషన్లను నిరసిస్తూ పెద్ద ఎత్తున చెలరేగిన హింసలో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు! రాజ్యాంగంలోని 371 (ఎ) ఆర్టికల్‌లో పేర్కొన్న ప్రత్యేక హక్కులకు ఇది విరుద్ధమన్నది నిరసనకారుల వాదన. నిర్ణయాధికారాల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండకూడదన్నది వారి డిమాండ్. నాగాలాండ్‌లో అత్యధిక శాతం ప్రజలు దీన్ని బలంగా విశ్వసిస్తారు. దీన్ని మార్చేందుకు మహిళల సాధికారత కోసం గళమెత్తే పలు స్వచ్ఛంద సంస్థలు ఎంత కృషి చేసినా లాభం లేకపోయింది. మహిళలకు సమాన హక్కులు కల్పించాలని ముఖ్యమంత్రి నిపూ రియో పదేపదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా పెద్దగా ఫలితమైతే లేదు. ఆయన తన నేషనల్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తరఫున ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు మహిళలకు టికెటిచ్చారు. కానీ మొత్తం 60 సీట్ల శాసనసభలో రెండే టికెట్లివ్వడం ఏ మేరకు సమన్యాయం చేసినట్టవుతుందో! కాంగ్రెస్, బీజేపీ అయితే మహిళలకు ఒక్కో టికెట్‌తోనే సరిపెట్టాయి. ప్రజలతో పాటు పార్టీలు కూడా మహిళల రాజకీయ ప్రాతినిధ్యానికి సరైన ప్రాధాన్యమివ్వడం లేదని ఈ సీట్ల కేటాయింపు చెప్పకనే చెబుతోంది. పార్లమెంటులో కూడా నాగాలాండ్ మహిళలకు దక్కిన ప్రాతినిధ్యం స్వల్పాతిస్వల్పం. అప్పుడెప్పుడో 1977లో రానో షైజా లోక్‌సభకు ఎన్నికవగా, తాజాగా 2022లో ఫంగ్నోన్ కొన్యాక్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రజలతో పాటు పార్టీల వైఖరి కూడా మారినప్పుడు మాత్రమే నాగాలాండ్ అసెంబ్లీలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం దక్కుతుంది. నాగాలాండ్ అసెంబ్లీకి మేఘాలయ, త్రిపురలతో పాటు ఈ నెలాఖర్లోగా పోలింగ్ పూర్తవుతుంది. త్రిపురకు ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీలకు 27న పోలింగ్ జరగనుంది. కేవలం ఆరుగురు మహిళలు మాత్రమే నామినేషన్ వేశారు. వారిలో ఇద్దరు అధికార ఎన్డీపీపీ అభ్యర్థులు, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్కో అభ్యర్థి మిగలగా మరో ఇద్దరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆ నలుగురిలో ఒక్కరైనా నెగ్గి చరిత్ర సృష్టిస్తారో లేదో చూడాలి. కనీసం సగం మందైనా గెలిస్తే మహి ళల రాజకీయ ప్రాతినిధ్యంపై నాగాలాండ్ ప్రజ ల్లో ఉన్న విముఖత మెల్లమెల్లగా తొలగిపోతున్నట్టు భావించవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం మార్చి 2న వెలువడే ఫలితాల్లో లభిస్తుంది. -
యూపీ అసెంబ్లీ ఎన్నికలు, అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని సోమవారం ప్రకటించారు. రానున్న అసెంబ్లీ పోరులో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డి)తో పొత్తును ఖరారు చేసిన ఆయన సీట్ల పంపకంపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని తాజాగా చెప్పారు. అయితే యూపీ ముఖ్యమంత్రి బరిలో ఉంటారని భావిస్తున్న తరుణంలో అఖిలేష్ ప్రకటన సంచలనం రేపింది. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాను సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూతో పోల్చడం దుమారాన్ని రాజేస్తోంది. గత ఎస్పీ ప్రభుత్వం చేపట్టిన పనుల పేరు మార్చడం, యూపీ ప్రభుత్వం కొత్తగా చేసేందీమీ లేదు, 'బాబా ముఖ్యమంత్రి' అంటూ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆతిద్యనాథ్పై అఖిలేష్ మండిపడ్డారు. ఆదివారం జరిగిన ర్యాలీలో అఖిలేష్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. జిన్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో పోల్చడం సిగ్గుచేటని యూపీ సీఎం స్పందించారు. ఇది విభజనను నమ్మే తాలిబానీ మనస్తత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేశారు. ప్రస్తుతం ప్రధాని మోదీ నేతృత్వంలో ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ నిర్మాణ కృషి జరుగుతోందని యోగి పేర్కొన్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో తమ అధికార పీఠాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ భారీ ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు తమ చేజారిపోయిన కంచుకోటను ఎలాగైనా దక్కించు కోవాలని కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో ముఖ్యంగా లఖీంపూర్ ఖేరీ హింస తరువాత కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా సుడిగాలి పర్యటనలతో సందడి చేస్తున్నారు. మహిళలకు 40 శాతం రిజర్వేషన్, అమ్మాయిలకు స్కూటీలూ లాంటి వాగ్దానాలతో తన వేగాన్ని పెంచిన సంగతి తెలిసిందే. -
నేర చరితులకు టిక్కెట్లివ్వొద్దు: ఈసీ
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేరచరితను మీడియాలో ప్రకటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల రాజకీయాలు నేరమయం కావడం ఆగిపోలేదని శుక్రవారం ఎన్నికల సంఘం(ఈసీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. అందుకు బదులుగా, నేర చరిత్ర ఉన్నవారికి టికెట్లు ఇవ్వకూడదని రాజకీయ పార్టీలను ఆదేశించడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడం మంచిదని సూచించింది. నేరమయ రాజకీయాలను అరికట్టేందుకు వారంలోగా ఒక ప్రణాళికతో తమ ముందుకు రావాలని ఈ సందర్భంగా జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ రవీంద్ర భట్ల ధర్మాసనం ఈసీని కోరింది. ఈ విషయంలో ఈసీకి సహకరించాలని పిటిషనర్, బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయకు సూచించింది. రాజకీయాల్లో నేరస్తుల ప్రమేయాన్ని అరికట్టేందుకు ఈసీ ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుందని ఈసీ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ కోర్టుకు తెలిపారు. నేరస్తులు రాజకీయాల్లోకి రాకుండా చూసే బాధ్యతను రాజకీయ పార్టీలకే అప్పగించడం మంచిదని సూచించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో క్రిమినల్ కేసులున్న చట్ట సభ్యులను అనర్హులను చేసే దిశగా చట్టం రూపొందే అవకాశం కనిపించడం లేదు’ అన్నారు. అశ్విని ఉపాధ్యాయ తరఫు న్యాయవాది గోపాల శంకర్‌నారాయణ్ ఈ వాదనతో ఏకీభవించారు. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుల్లో దాదాపు 46% మందికి నేర చరిత్ర ఉందని వివరించారు. అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను మీడియాకు తెలపాలని 2018లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
నేను పోటీచేయను: స్పీకర్ సుమిత్రా
న్యూఢిల్లీ/ఇండోర్: తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రస్తుత లోక్‌సభ స్పీకర్, సీనియర్ బీజేపీ నేత సుమిత్రా మహాజన్ ప్రకటించారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశానని శుక్రవారం ఇండోర్‌లో ఆమె మీడియాతో చెప్పారు. ‘ఏప్రిల్ 12వ తేదీకి సుమిత్రకు 75 ఏళ్లు నిండుతాయి. 75 ఏళ్లు దాటిన వారికి బీజేపీ టికెట్ ఇస్తుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. సుమిత్ర నిర్ణయంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. సుమిత్రా మహాజన్ లోక్‌సభకు 8సార్లు ఎంపీగా గెలుపొందారు. తొలిసారిగా 1989లో ఇండోర్ నుంచి గెలిచారు. వాజపేయి ప్రభుత్వంలో మానవ వనరుల శాఖ, టెలికాం శాఖకు సహాయ మంత్రిగా పనిచేశారు. -
అడ్వాణీ బాటలోనే జోషి!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలుగా బీజేపీకి వెన్నెముకగా నిలిచిన సీనియర్ నేత లాల్‌క్రిష్ణ అడ్వాణీకి ఎదురైన అనుభవమే సీనియర్ నేత, ప్రస్తుతం లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మురళీ మనోహర్ జోషికి కూడా ఎదురైంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం కాన్పూర్ ఎంపీ మురళీ మనోహర్ జోషి ఈసారి పోటీ నుంచి దూరంగా ఉండాలని పార్టీ సూచించింది. సీనియర్లకు టికెట్ ఇవ్వరాదని పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని, కురువృద్ధుడు అడ్వాణీ సహా సీనియర్లందరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం జోషి కార్యాలయం కూడా స్పష్టం చేసింది. దీనిపై జోషి కాన్పూర్ ఓటర్లకు వివరణ కూడా ఇచ్చారని తెలిసింది. 85 ఏళ్ల జోషి 2014లో కాన్పూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన విషయం తెలిసిందే. జోషి పోటీ చేయకూడదన్నది పార్టీ పెద్దల నిర్ణయమని పార్టీ జాతీయ కార్యదర్శి రామ్‌లాల్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. జోషి ఓటర్లకు విడుదల చేసిన ప్రకటనలో కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ‘ప్రియమైన కాన్పూర్ ఓటర్లకు... రామ్‌లాల్ ద్వారా అందిన సూచన మేరకు నేను కాన్పూర్ నుంచే కాదు మరే స్థానం నుంచి పోటీ చేసే అవకాశం లేదు’అని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. జోషి 2009 వారణాసి నుంచి గెలుపొందారు. 2014లో ప్రధాని నరేంద్రమోదీకోసం ఆయన ఈ సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే టికెట్ ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ చాలామంది సీనియర్లు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. అధిష్టానంపైన విమర్శలకు సాహసించలేదు. అయితే పార్టీ నాయకులు మాత్రం ఇది సమష్టి నిర్ణయమని, సీనియర్లు కొత్తవారికి అవకాశాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దాదాపు 300 మంది అభ్యర్థుల పేర్లు పార్టీ ప్రకటించినప్పటికీ కాన్పూర్ సీటుపై ఏ ప్రకటనా వెలువడలేదు. అయితే అడ్వాణీకి పార్టీ టికెట్ నిరాకరించినప్పటికీ ఆయన కూతురు, లేదా కుమారుడికి అవకాశమివ్వొచ్చన్న వార్తలు వచ్చాయి. 91 ఏళ్ల అడ్వాణీతో పాటు శాంతకుమార్, బీసీ ఖండూరి, కరియాముండా, కల్రాజ్ మిశ్రా, బిజోయ్ చక్రవర్తి, పలుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన అనేక మంది టికెట్ నిరాకరించబడిన జాబితాలో ఉన్నారు. -
నేను పోటీ చేయను
లక్నో: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు, యూపీ మాజీ సీఎం మాయావతి బుధవారం ప్రకటించారు. అయినాసరే తాను ప్రధాని పదవి రేసులోనే ఉన్నానని సంకేతాలిచ్చారు. ప్రధాని అయ్యాక ఆర్నెలల్లోపు ఏదో సభలో సభ్యురాలినైతే చాలనీ, అవసరం అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాతే వచ్చే ఏదైనా ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితులు, దేశ అవసరాలు, పార్టీ కోసం నేను పనిచేయాల్సి ఉంది. ఈ కారణంగా లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. 1995లో తొలిసారి నేను యూపీ సీఎం అయినప్పుడు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీని కాదు. లోక్‌సభలో నా అవసరముంటే ఏదోక లోక్‌సభ స్థానంలో ఉపఎన్నికల్లో గెలిచి పార్లమెంట్లో అడుగుపెడతా’ అని ఆమె తెలిపారు. -
విధానసభ ఎన్నికల బరిలో దిగను
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో పోటీ చేయబోనని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన ఉందా అంటూ ఓ టీవీ చానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ‘ఢిల్లీవాసుల నుంచి నాకు జవాబు లభించింది. ఢిల్లీ రూపురేఖలను మార్చలేరు. మీరు బయటకు వెళాల్ల్సిన తరుణం ఆసన్నమైందని వారు స్పష్టం చేశారు’ అని తెలిపారు. నగరవాసులు నాయకత్వ మార్పు కోరుకుంటున్నారన్నారు. కాగా గత విధానసభ ఎన్నికల్లో షీలా దీక్షిత్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 25 వేలకు పైగా ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయిన సంగతి విదితమే. ప్రజలు తన తలరాతను నిర్ణయించారని, తాను దానిని అంగీకరించానని చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసినప్పటికీ అందుకు తగిన గుర్తింపు లభించలేదన్నారు. ఢిల్లీ రాజకీయాలనుంచి బయటపడ్డానని, ఎన్నికలలో పోటీచేయాలన్న ఆసక్తి తనకు లేదన్నారు.ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కూడా తనకు ఎలాంటి పాత్ర అప్పగించలేదని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి తాను మద్దతు ఇస్తానని, పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తానని తెలిపారు. ఢిల్లీలో రాజకీయ గందరగోళానికి ఆమ్ ఆద్మీ పార్టీయేనని షీలా అభిప్రాయపడ్డారు. అరవింద్ అబద్ధపు హామీలతో ప్రజలను తప్పుదారిపట్టించారని ఆరోపించారు. ఆప్ విన్నపం మేరకు తాము మద్దతు ఇచ్చామని, అయినప్పటికీ సమర్థంగా పనిచేయలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల గురించి మాట్లాడుతూ ఆప్, బీజేపీ ఇప్పటికే ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టాయని, అయితే తమ పార్టీ ఇంకా ఆ దిశగా అడుగులు వేయాల్సి ఉందన్నారు. గత ఎన్నికలలో పరాజయం తరువాత పార్టీ గుణపాఠం నేర్చుకుందని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సమష్టి నాయకత్వం కింద పనిచేస్తుందన్నారు. కాగా తాను విధానసభ ఎన్నికల బరిలోకి దిగబోనంటూ షీలాదీక్షిత్ ప్రకటించడం ఢిల్లీ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నవారందరికీ నిరాశ కలిగించింది.