
లక్నో: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు, యూపీ మాజీ సీఎం మాయావతి బుధవారం ప్రకటించారు. అయినాసరే తాను ప్రధాని పదవి రేసులోనే ఉన్నానని సంకేతాలిచ్చారు. ప్రధాని అయ్యాక ఆర్నెలల్లోపు ఏదో సభలో సభ్యురాలినైతే చాలనీ, అవసరం అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాతే వచ్చే ఏదైనా ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితులు, దేశ అవసరాలు, పార్టీ కోసం నేను పనిచేయాల్సి ఉంది. ఈ కారణంగా లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. 1995లో తొలిసారి నేను యూపీ సీఎం అయినప్పుడు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీని కాదు. లోక్‌సభలో నా అవసరముంటే ఏదోక లోక్‌సభ స్థానంలో ఉపఎన్నికల్లో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెడతా’ అని ఆమె తెలిపారు.