
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని సోమవారం ప్రకటించారు. రానున్న అసెంబ్లీ పోరులో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డి)తో పొత్తును ఖరారు చేసిన ఆయన సీట్ల పంపకంపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని తాజాగా చెప్పారు. అయితే యూపీ ముఖ్యమంత్రి బరిలో ఉంటారని భావిస్తున్న తరుణంలో అఖిలేష్ ప్రకటన సంచలనం రేపింది.
పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాను సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూతో పోల్చడం దుమారాన్ని రాజేస్తోంది. గత ఎస్పీ ప్రభుత్వం చేపట్టిన పనుల పేరు మార్చడం, యూపీ ప్రభుత్వం కొత్తగా చేసేందీమీ లేదు, 'బాబా ముఖ్యమంత్రి' అంటూ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆతిద్యనాథ్‌పై అఖిలేష్ మండిపడ్డారు.
ఆదివారం జరిగిన ర్యాలీలో అఖిలేష్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. జిన్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో పోల్చడం సిగ్గుచేటని యూపీ సీఎం స్పందించారు. ఇది విభజనను నమ్మే తాలిబానీ మనస్తత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేశారు. ప్రస్తుతం ప్రధాని మోదీ నేతృత్వంలో ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ నిర్మాణ కృషి జరుగుతోందని యోగి పేర్కొన్నారు.
కాగా ఉత్తరప్రదేశ్‌లో తమ అధికార పీఠాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ భారీ ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు తమ చేజారిపోయిన కంచుకోటను ఎలాగైనా దక్కించు కోవాలని కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో ముఖ్యంగా లఖీంపూర్ ఖేరీ హింస తరువాత కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా సుడిగాలి పర్యటనలతో సందడి చేస్తున్నారు. మహిళలకు 40 శాతం రిజర్వేషన్, అమ్మాయిలకు స్కూటీలూ లాంటి వాగ్దానాలతో తన వేగాన్ని పెంచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment