న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేరచరితను మీడియాలో ప్రకటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల రాజకీయాలు నేరమయం కావడం ఆగిపోలేదని శుక్రవారం ఎన్నికల సంఘం(ఈసీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. అందుకు బదులుగా, నేర చరిత్ర ఉన్నవారికి టికెట్లు ఇవ్వకూడదని రాజకీయ పార్టీలను ఆదేశించడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడం మంచిదని సూచించింది. నేరమయ రాజకీయాలను అరికట్టేందుకు వారంలోగా ఒక ప్రణాళికతో తమ ముందుకు రావాలని ఈ సందర్భంగా జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ రవీంద్ర భట్‌ల ధర్మాసనం ఈసీని కోరింది. ఈ విషయంలో ఈసీకి సహకరించాలని పిటిషనర్, బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయకు సూచించింది.
రాజకీయాల్లో నేరస్తుల ప్రమేయాన్ని అరికట్టేందుకు ఈసీ ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుందని ఈసీ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ కోర్టుకు తెలిపారు. నేరస్తులు రాజకీయాల్లోకి రాకుండా చూసే బాధ్యతను రాజకీయ పార్టీలకే అప్పగించడం మంచిదని సూచించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో క్రిమినల్ కేసులున్న చట్ట సభ్యులను అనర్హులను చేసే దిశగా చట్టం రూపొందే అవకాశం కనిపించడం లేదు’ అన్నారు. అశ్విని ఉపాధ్యాయ తరఫు న్యాయవాది గోపాల శంకర్‌నారాయణ్ ఈ వాదనతో ఏకీభవించారు. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుల్లో దాదాపు 46% మందికి నేర చరిత్ర ఉందని వివరించారు. అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను మీడియాకు తెలపాలని 2018లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment