న్యూఢిల్లీ: చట్టసభల్లో నేరచరితుల సంఖ్య పెరిగిపోతూండటంపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న వారిని ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎందుకు నిర్ణయించారో వివరణ ఇవ్వడంతోపాటు ఆయా కేసుల జాబితాను రాజకీయ పక్షాలన్నీ తమ వెబ్‌సైట్లలో ఉంచాలని స్పష్టంచేసింది. ఎన్నికల్లో విజయం సాధించగలరన్న ఒకే ఒక్క కారణంతో నేర చరితులకు టిక్కెట్లు ఇచ్చామని పార్టీలు చెప్పజాలవని, వారి అర్హతలు, సమర్థత వంటి అంశాలను ప్రస్తావిస్తూ తగిన కారణాలు చూపాలని జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ రవీంద్రభట్‌ల బెంచ్ స్పష్టం చేసింది.
రాజకీయాలు నేరపూరితం కావడంపైకోర్టు 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పు(అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ నేరాల వివరాలు బహిర్గతం చేయాలి) అమలు కావడం లేదని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా లేదా నామినేషన్ల దాఖలు ప్రారంభమయ్యే తేదీకి కనీసం రెండు వారాల ముందు వారి నేర చరిత్రను ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి అన్ని సోషల్ మీడియా వేదికలపై వెల్లడించాలని, జాతీయ, స్థానిక వార్తా పత్రికల్లోనూ ప్రకటనలు జారీ చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను పాటిస్తున్నట్లు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు లిఖిత పూర్వకంగా తెలపాలని, అభ్యర్థులను ఎంపిక చేసిన మూడు రోజు(72 గంటలు) ల్లోగా ఈ పని పూర్తి చేయాలని వివరించింది. ఎవరైనా ఈ ఆదేశాలను పాటించని పక్షంలో ఆ వివరాలను తమకు ఇవ్వాలని ఈసీకి చెప్పింది.
నేర చరితులు పెరుగుతున్నారు
గత నాలుగు ఎన్నికలను పరిశీలిస్తే చట్టసభల్లో నేరచరితులు ఎక్కువవుతున్నట్లు స్పష్టమవుతోందని సుప్రీంకోర్టు ఈ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. నేరచరితులను పోటీలో నిలిపిన పార్టీలకు లేదా అభ్యర్థులకు జరిమానా విధించాలన్న అంశంపై కొంత జాగరూకత అవసరమని, రాజకీయ కారణాలతో అభ్యర్థులపై తీవ్ర ఆరోపణలు వచ్చే అవకాశం ఉండటం ఇందుకు కారణమని కోర్టు వివరించింది. 2018 సెప్టెంబర్‌లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఒక ఏకగ్రీవ తీర్పునిస్తూ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తమపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను ఈసీకి వెల్లడించాలని, ఆ వివరాలకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా ప్రచారం కూడా కల్పించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలు నేరపూరితం కావడమన్న రోగానికి పార్లమెంటు తగిన చికిత్స చేయాలని, నేర చరితులు చట్టసభల్లో ప్రవేశించకుండా చట్టాలు చేయాలని, కలుషితమైన రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని తన ఆదేశాల్లో పేర్కొంది. నేర చరితులకు టికెట్లిస్తే అందుకు వివరణ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రధాని మోదీ ఉల్లంఘించారని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు.
ప్రజాస్వామ్యం మరింత బలోపేతం: బీజేపీ
రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల నేరచరిత్రను ఆన్‌లైన్‌లో ఉంచాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఈ చర్య ద్వారా ఎన్నికల్లో ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొంది.
ఎంపీల్లో 40 శాతం మందిపై కేసులు: ఈసీ
పార్లమెంట్‌లోని కనీసం 43 శాతం ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఈసీ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కోర్టు ధిక్కరణకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా నేరచరితుల వివరాలను, వారి ఎంపికకు కారణాలను, క్రిమినల్ కేసులు లేని వారిని ఎందుకు ఎంపిక చేయలేదో తమతమ వెబ్‌సైట్లలో పార్టీలు వెల్లడించడాన్ని తప్పనిసరి చేయాలన్న బీజేపీ నేత, పిటిషనర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ తరఫు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ సూచనను ఈసీ అంగీకరించింది. ఈ మేరకు 2018 అక్టోబరు 10వ తేదీన ఫార్మ్ –26లో కొన్ని మార్పులు చేస్తూ నేర చరిత్ర వివరాలను అందించాల్సిందిగా రాజకీయ పార్టీలకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో ఎలక్షన్ సింబల్ ఆర్డర్–1968లోగానీ, ఎన్నికల నిబంధనావళిలోగానీ తగు మార్పులు చేయకపోవడం వల్ల 2018 అక్టోబర్ నాటి నోటిఫికేషన్‌కు న్యాయబద్ధత లేకుండా పోయిందన్న అశ్వినీకుమార్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment