న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘాని(ఈసీ)కి నేర చరిత్ర వెల్లడించాలన్న ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై కేంద్రానికి, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ‘ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా విధిగా తమ నేర చరిత్రను ఈసీకి వెల్లడించాలి. ఈ వివరాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బహిరంగపరచాలి’ అంటూ గత ఏడాది తీర్పు చెప్పింది. ఫారం–26లో సవరణ చేస్తూ, పార్టీలు, అభ్యర్థులకు మార్గదర్శకాలు ఈసీ జారీ చేసింది.
కానీ ఎన్నికల నిబంధనావళిని, ఎన్నికల చిహ్నాల వరుస క్రమాన్ని మార్చకుండా జారీ చేసిన ఈ మార్గదర్శకాలకు ఎటువంటి చట్టబద్ధత ఉండనందున కోర్టు ధిక్కారంకింద చర్యలు తీసుకోవాలని న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ పిటిషన్ వేశారు. అభ్యర్థులు నేర చరిత్రను బహిరంగ పర్చాల్సిన ప్రముఖ పత్రికలు, న్యూస్ చానెళ్ల పేర్లను ఈసీ స్పష్టం చేయలేదు. దీంతో అభ్యర్థులు ప్రజాదరణ లేని పత్రికల్లో, వీక్షకులుండని సమయాల్లో చానెళ్లలోనూ తమ నేర చరిత్రను వెల్లడించారనీ, ఇలాంటి వారిపై ఈసీ చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ వినీత్ శరన్‌ల ధర్మాసనం శుక్రవారం విచారించింది. 2018 సెప్టెంబర్ 25వ తేదీన వెలువరించిన తమ తీర్పును అమలు చేయకపోవడంపై వివరణ కోరుతూ ఈసీలోని ముగ్గురు కమిషనర్లతోపాటు న్యాయశాఖ, కేబినెట్ కార్యదర్శులకు ధర్మాసనం నోటీసులిచ్చింది.
ఈవీఎం ఫలితాలతో సరిపోల్చే వీవీప్యాట్‌ల సంఖ్య పెంచాలన్న డిమాండ్‌పై ఈసీ
లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ స్థానంలోని ఒక పోలింగ్ బూత్‌లో ఈవీఎం ఫలితాలతో వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి చూడాలన్న ప్రస్తుత విధానమే అత్యంత అనుకూలమైందని ఈసీ పేర్కొంది. కనీసం 50 శాతం ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చి చూసేలా ఈసీని ఆదేశించాలంటూ 21 ప్రతిపక్ష పార్టీలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. దీనిపై ఈసీ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది. దీంతో ఈసీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ‘ఈవీఎంల ఫలితాలలో సరిపోల్చే వీవీ ప్యాట్ల సంఖ్యను పెంచినప్పటికీ ప్రస్తుత విధానంపై 99.9936 శాతంగా ఉన్న విశ్వాసంపై ఏమాత్రం ప్రభావం చూపబోదు’ అని తెలిపింది. ప్రస్తుత విధానంలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరగడం లేదనటానికి ప్రతిపక్షాలు పరిగణనలోకి తీసుకోదగ్గ ఒక్క కారణం కూడా చూపలేకపోయినట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment