అభ్యర్థుల చరిత్ర ఓటర్లకు తెలియాలి | SC disinclined to issue orders on tainted candidates | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల చరిత్ర ఓటర్లకు తెలియాలి

Published Wed, Aug 29 2018 1:05 AM | Last Updated on Sun, Sep 2 2018 5:36 PM

SC disinclined to issue orders on tainted candidates - Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల నేర చరిత్ర గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. నేరాభియోగాలు ఎదుర్కొంటున్న నాయకులు పార్టీల టికెట్లపై బరిలోకి దిగకుండా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేయొచ్చని పేర్కొంది. నేరమయ రాజకీయాలపై దాఖలైన పలు పిటిషన్ల విచారణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ముగించి తీర్పును రిజర్వులో ఉంచింది.

చివరి రోజు కేంద్రం, ఎన్నికల సంఘం తమ వాదనలను వినిపించాయి. నేరాభియోగాలు మోపిన సమయంలోనే రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించొచ్చా అన్న అంశంపై అత్యున్నత ధర్మాసనం విచారణ చేప్టటింది. ప్రస్తుతం, నేరం రుజువైన తరువాతే చట్టసభ సభ్యులపై నిషేధం అమల్లో ఉంది.

కేంద్రం వర్సెస్‌ ఈసీ
నేరం రుజువుకాక ముందే చట్టసభ సభ్యులపై నిషేధం విధించడంపై సుప్రీం మార్గదర్శకాలు జారీచేయాలని ఎన్నికల సంఘం కోరగా, కేంద్రం విభేదించింది. శాసన వ్యవస్థ విషయంలో న్యాయ వ్యవస్థ తలదూర్చొద్దని గట్టిగా బదులిచ్చింది. ముందస్తు షరతులు విధిస్తే అభ్యర్థి ఎన్నికల్లో పోటీచేసే హక్కుకు తీవ్ర విఘాతం కలుగుతుందని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ తెలిపారు.

నేరాభియోగాలు ఎదుర్కొంటున్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీచేయొచ్చని, కానీ పార్టీల గుర్తులు, టికెట్లపై కాదని బెంచ్‌ వ్యాఖ్యానించగా పైవిధంగా స్పందించారు. ‘అభ్యర్థుల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంది. పార్టీలు తమ టికెట్లపై ఎవరినైనా పోటీలోకి దింపొచ్చు. కానీ నేర చరిత్రను బహిర్గతంచేసిన వ్యక్తిని పార్టీ టికెట్లతో బరిలోకి దింపొద్దు. ఈమేరకు పార్టీలకు ఈసీ ఆదేశాలు జారీచేయొచ్చు’ అని బెంచ్‌ తెలిపింది. దోషిగా తేలే వరకు ఎవరైనా అమాయకులే అని, పార్టీ టికెట్లపై పోటీచేయకుండా నిషేధం విధించడం ఓటింగ్‌ హక్కును, పోటీచేసే హక్కును దూరం చేయడంతో సమానమని అటార్నీ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement