సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలుగా బీజేపీకి వెన్నెముకగా నిలిచిన సీనియర్ నేత లాల్‌క్రిష్ణ అడ్వాణీకి ఎదురైన అనుభవమే సీనియర్ నేత, ప్రస్తుతం లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మురళీ మనోహర్ జోషికి కూడా ఎదురైంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం కాన్పూర్ ఎంపీ మురళీ మనోహర్ జోషి ఈసారి పోటీ నుంచి దూరంగా ఉండాలని పార్టీ సూచించింది. సీనియర్లకు టికెట్ ఇవ్వరాదని పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని, కురువృద్ధుడు అడ్వాణీ సహా సీనియర్లందరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం జోషి కార్యాలయం కూడా స్పష్టం చేసింది. దీనిపై జోషి కాన్పూర్ ఓటర్లకు వివరణ కూడా ఇచ్చారని తెలిసింది. 85 ఏళ్ల జోషి 2014లో కాన్పూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన విషయం తెలిసిందే. జోషి పోటీ చేయకూడదన్నది పార్టీ పెద్దల నిర్ణయమని పార్టీ జాతీయ కార్యదర్శి రామ్‌లాల్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. జోషి ఓటర్లకు విడుదల చేసిన ప్రకటనలో కూడా ఇదే విషయాన్ని తెలిపారు.
‘ప్రియమైన కాన్పూర్ ఓటర్లకు... రామ్‌లాల్ ద్వారా అందిన సూచన మేరకు నేను కాన్పూర్ నుంచే కాదు మరే స్థానం నుంచి పోటీ చేసే అవకాశం లేదు’అని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. జోషి 2009 వారణాసి నుంచి గెలుపొందారు. 2014లో ప్రధాని నరేంద్రమోదీకోసం ఆయన ఈ సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే టికెట్ ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ చాలామంది సీనియర్లు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. అధిష్టానంపైన విమర్శలకు సాహసించలేదు.
అయితే పార్టీ నాయకులు మాత్రం ఇది సమష్టి నిర్ణయమని, సీనియర్లు కొత్తవారికి అవకాశాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దాదాపు 300 మంది అభ్యర్థుల పేర్లు పార్టీ ప్రకటించినప్పటికీ కాన్పూర్ సీటుపై ఏ ప్రకటనా వెలువడలేదు. అయితే అడ్వాణీకి పార్టీ టికెట్ నిరాకరించినప్పటికీ ఆయన కూతురు, లేదా కుమారుడికి అవకాశమివ్వొచ్చన్న వార్తలు వచ్చాయి. 91 ఏళ్ల అడ్వాణీతో పాటు శాంతకుమార్, బీసీ ఖండూరి, కరియాముండా, కల్రాజ్ మిశ్రా, బిజోయ్ చక్రవర్తి, పలుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన అనేక మంది టికెట్ నిరాకరించబడిన జాబితాలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment