
దేశ రాజధానిలో ఎలక్ర్టిక్ బస్సులతో కాలుష్యానికి చెక్..
సాక్షి, న్యూఢిల్లీ : కాలుష్య కోరల్లో కూరుకుపోయిన ఢిల్లీకి ఉపశమనం కలిగించే రీతిలో రాజధాని రహదారులపై వేయి ఎలక్ర్టిక్ బస్సులను నడిపేందుకు కన్సల్టెంట్ నియామకానికి ఢిల్లీ సర్కార్ బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కన్సల్టెంట్ నియామకంపై నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో వేయి ఎలక్ర్టిక్ బస్సులను నడిపేందుకు కన్సల్టెంట్‌ను నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
రాజధానిలో కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ఢిల్లీ రవాణా వ్యవస్థ ఆధునీకరణ దిశగా ఇది మెరుగైన చర్యగా ఆయన అభివర్ణించారు.ఈ బస్‌లను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనపై కూడా కేబినెట్‌లో విస్తృత చర్చ జరిగినా కొన్ని సాంకేతిక అంశాలతో దీనిపై నిర్ణయాన్ని రవాణా శాఖకు విడిచిపెట్టారు. కాగా, ఈ బస్‌లతో పోలిస్తే ఖర్చు తక్కువ అయ్యే హైడ్రోజన్ ఇంధన బ్యాటరీ ఆధారిత బస్‌లను ఉపయోగించే అవకాశాలను పరిశీలించాలని సుప్రీం కోర్టు ఇటీవల ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.