
న్యూఢిల్లీ: కరోనాను నివారించే చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ గురువారం కీలక ఆదేశాలను జారీ చేశారు. ఢిల్లీలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గూమికూడవద్దని, ఉల్లంఘిస్తే చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. వినోదం, కాలక్షేపం కోసం ప్రజలు బయట సంచరించవద్దని, అత్యవసర పరిస్థితులో మాత్రమే ప్రజలు బయటకు రావాలని ఆదేశించారు. ర్యాలీలు, నిరసనలు, వినోద ప్రదర్శనల్లో ఐదుగురి కంటే ఎక్కువ మంది పాల్గొనవద్దని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ప్రజా రవాణాల్లో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ ఆదేశాలు మార్చి 31 వరకు వర్తిస్తాయని శ్రీవాస్తవ తెలిపారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.