
మాజీ డ్రైవర్ ఫ్యాషన్ డిజైనర్ గొంతు కోశాడు
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఫ్యాషన్ డిజైనర్ పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఆమె గొంతుకోశాడు. ప్రస్తుతం ఆమె అత్యంత విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గతంలో ఆమె వద్ద డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తే ఈ హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసుల సమాచారం ప్రకారం ఢిల్లీలోని శివాలిక్ అపార్ట్‌మెంట్‌లో కావేరి లాల్ అనే ఫ్యాషన్ డిజైనర్ తన తల్లి రేఖాతో కలిసి ఉంటోంది. వీరి వద్ద గతంలో అనిల్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేసేవాడు.
అయితే, ఇటీవలె వారివద్ద పని మానేశాడు. మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో కావేరీ అపార్ట్‌మెంట్‌కు వచ్చిన అనిల్ ఇంటి డోర్ బెల్లు కొట్టాడు. అతడి తల్లి ఎందుకొచ్చావని అడగగా తాను ఇదే అపార్ట్‌మెంట్‌లోని మరో ఇంట్లో ఉద్యోగం చేస్తున్నానని, వారి కారు పార్క్ చేసేందుకు కారు అడ్డుగా ఉందని చెప్పాడు. అయితే, కావేరీ తల్లి కారు తాళం ఇచ్చే సమయంలో తాను వెళ్లి పార్క్ చేస్తానని కావేరీ వెళ్లింది. ఆమె వెళ్లి డ్రైవర్ సీట్లో కూర్చోగానే తనతో తెచ్చుకున్న కత్తితో అనిల్ దాడి చేశాడు. ఆమె గొంతు కోశాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న విద్యార్థులు గట్టిగా అరవడంతో అతడు పారిపోయాడు. ప్రస్తుతం కావేరి సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో కోలుకుంటోంది. గతంలో అనిల్ ప్రవర్తన బాగా లేకపోవడంతో ఉద్యోగంలో నుంచి తొలగించారని పోలీసులు చెప్పారు. ఆ కక్షతోనే దాడికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.