
శీల పరీక్షకు ఇక స్వస్తి
న్యూఢిల్లీ: అత్యాచార బాధితులపై టు ఫింగర్ టెస్ట్‌ను నిషేధించలేదని తెలుపుతూ జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని ఆప్ సర్కారు నిర్ణయించింది. ఈ ఉత్తర్వు జారీ చేసిన అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ప్రభుత్వం అత్యాచార బాధితులపై టు ఫింగర్ టెస్ట్‌ను నిషేధించనుందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ సోమవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఇందుకు సంబంధించి కొత్త నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేయనుందని ఆయన చెప్పారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుకు వక్ర భాష్యం చెప్పారన్నారు. చికిత్స కోసం మినహా అత్యాచార నిర్ధరణకు టు ఫింగర్ పరీక్ష నిర్వహించడాన్ని ప్రభుత్వం నిషేధిస్తుందని ఆయన తెలిపారు.
టు ఫింగర్ టెస్ట్ వివరాలు.. అత్యాచార నిర్ధరణ కోసం అవసరమైతే బాధితులపై టు ఫింగర్ టెస్ట్‌గా పేర్కొనే పర్ వాజినల్ (పీవీ) పరీక్ష జరిపించడానికి అనుమతించినట్లు తెలుపుతూ ప్రభుత్వం మే 31న అన్ని ఆసుపత్రులకు మార్గదర్శకాలు జారీ చేసింది. బాధితురాలి అనుమతితో ఈ పరీక్ష జరిపించవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొంది. బాధితురాలు లైంగిక సంబంధాలను నిర్ధారించడం కోసం టు ఫింగర్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. బాధితురాలిపై ఈ పరీక్ష జరిపించడం అమానవీయమని, అది ఆమె గౌరవాన్ని కించపరచడమేనని అభిప్రాయపడుతున్న పలు ఎన్జీవోలు ఈ పరీక్షను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. సుప్రీం కోర్టు కూడా ఈ పరీక్ష జరిపించడం బాధితుల వ్యక్తిగత జీవితంలో తలదూర్చడమేనని అభిప్రాయపడి, అత్యాచార నిర్ధారణకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆప్ సర్కారు టు ఫింగర్ టెస్ట్ పరీక్షను ప్రభుత్వం నిషేధించలేదని పేర్కొంటూ దానిని అవసరమైతే జరిపించడానికి అనుమతిస్తూ ఢిల్లీ సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో ఉపసంహరించాలని ఆప్ సర్కారు నిర్ణయించింది.