ఢిల్లీలో అద్దెకు టాక్సీ, బైక్ పథకాలు!
న్యూ ఢిల్లీః స్థానిక ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై ఢిల్లీవాసుల కష్టాలు తీరనున్నాయి. బస్టాప్ లో, రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఆఫీసులకు, గమ్యస్థానాలకు చేరడానికి తిరిగి నడవాలంటే ఎంతో కష్టంగా అనిపిస్తుంది. ఓపక్క టైమ్ టెన్షన్, మరోపక్క ఎండవేడి వేధిస్తుంటాయి. అటువంటి సమయంలో పర్యాటకులు, ప్రయాణీకులకు సహాయ పడేందుకు త్వరలో ప్రభుత్వం బైక్ టాక్సీ, రెంట్ ఎ బైక్ పథకాలను ప్రవేశ పెడుతోంది. ఈ నూతన సౌకర్యంతో వినియోగదారులు గమ్యస్థానాలకు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది.
భారత రాజధాని నగరంలో ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశ పెడుతోంది. గుర్గావ్, బెంగుళూరులోని అధికారుల కార్యకలాపాల్లో అతిక్రమణలను గమనించిన ప్రభుత్వం మరింత పటిష్ఠమైన నిబంధనలతో ఢిల్లీ ప్రజలకోసం కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. బెంగుళూరు, గుర్గావ్ లలో బైక్ టాక్సీ, రెంట్ ఎ బైక్ పథకాల ఆపరేటర్లు నిబంధనలను అతిక్రమించి ప్రైవేటు వాహనాలను నడుపుతున్నారు. నగరంలోని పర్యాటకులు, ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా చేసుకున్న'ఆప్' ప్రభుత్వం ఫిబ్రవరి నెలలోనే 'రెంట్ ఎ బైక్' (అద్దెకు బైక్) పథకానికి ఆమోదం తెలిపినా నోటిఫై చేయలేదు. ప్రస్తుతం ఈ బైక్ టాక్పీ పథకం పరిశీలనలో ఉందని, ఈ పథకంలో కేవలం వాణిజ్య వాహనాలను మాత్రమే అనుమతిస్తారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పథకాన్ని రవాణా శాఖ అధ్యయనం చేసిన తర్వాత చివరి నోటిఫికేషన్ విడుదల చేస్తుందని తెలిపారు.
ప్రస్తుతం ఢిల్లీ నగరంలో 'బైక్ టాక్సీ', 'రెంట్ ఎ బైక్' పథకాలపై దృష్టి పెట్టామని, త్వరలో అన్ని అంశాలను పరిశీలించి పథకాలపై చివరి ప్రకటనను విడుల చేస్తామని అధికారులు చెప్తున్నారు. అద్దెకు బైక్ పథకంలో పర్యాటకులు బైక్ కౌంటర్ల వద్ద వారి గుర్తింపును సమర్పించి బైక్ ను తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు.