సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనపై ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులకు శిక్ష అమలు తేదీని ఖరారు చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలలోపు ఉరిశిక్ష అమలు చేయాలని పటియాల హౌస్‌కోర్టు ఆదేశించింది. ఈ మేరకు విచారణలో భాగంగా మంగళవారం డెత్ వారెంట్‌ను జారీచేసింది. కాగా దోషులను వెంటనే శిక్షించాలని కోరుతూ నిర్భయ తల్లి ఆశాదేవీ పటియాల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన న్యాయస్థానం దోషులకు (ముఖేష్, పవన్‌గుప్తా, అక్షయ్‌కుమార్, వినయ్‌శర్మ) డెత్ వారెంట్‌ను జారీచేసింది. దీంతో ఏడేళ్ల నిరీక్షణకు న్యాయస్థానం ఎట్టకేలకు తెరదించింది.
ఉరిశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ.. నలుగురు దోషులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇదివరకే తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీంతో శిక్ష అమలుకు లైన్‌క్లియర్ అయ్యింది. కాగా 2012 డిసెంబర్ 16న నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. అనంతరం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద ఆందోళనకు దారి తీసింది. 2013 సెప్టెంబర్ 13న నలుగురు నిందితులును దోషులకు తేల్చుతూ.. న్యాయస్థానం మరణశిక్షను విధించింది.
నమ్మకం పెరిగింది..
- దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు ఇచ్చిన తీర్పును నిర్భయ తల్లి ఆశాదేవీ సంతోషం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగిందన్నారు. ఏడేళ్ల అనంతరం తన బిడ్డకు న్యాయం జరిగిందన్నారు.
మంత్రి తానేటి వనితా హర్షం
నిర్భయ కేసులో నిందితులకు న్యాయ స్దానం ఉరిశిక్ష ఖరారు చేయడంపై ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితా హర్షం వ్యక్తం చేశారు. ‘నిర్భయ తల్లిదండ్రులకు న్యాయం జరిగింది. నిర్భయ కేసులో నిందితులకు ఊరి వేయాలని దేశ వ్యాప్తంగా యువత, ప్రజలు కోరుకున్నారు. ఇటువంటి ఘటనలు ఆంద్రప్రదేశ్‌లో చోటు చేసుకోకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశ చట్టాని తీసుకువచ్చారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment