లాయర్‌కు రూ. 125 కోట్లకు పైగా ఆస్తులు!
లాయర్‌కు రూ. 125 కోట్లకు పైగా ఆస్తులు!
Published Thu, Oct 20 2016 2:51 PM | Last Updated on Thu, Sep 27 2018 4:31 PM
సుప్రీంకోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టులో కూడా ప్రాక్టీసు చేస్తున్న లాయర్ ఆస్తులు చూసి ఆదాయపన్నుశాఖ అధికారులే నోళ్లు వెళ్లబెట్టారు. లెక్కల్లోకి రాని ఆస్తి తనకు దాదాపు రూ. 125 కోట్ల వరకు ఉంటుందని ఆయన స్వయంగా వెల్లడించారు. దక్షిణ ఢిల్లీలోని ఆయన ఇంటిమీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు ఈ విషయం తెలిసింది. ఈమధ్యే ఆయన ఢిల్లీలో రూ. 100 కోట్లు పెట్టి పెద్ద బంగ్లా కొనడంతో ఆయన మీద అందరి దృష్టి పడింది. దాంతోపాటు ఐటీ దాడులు చేయగా, పలు రకాల ఆస్తులు, బూటకపు కంపెనీలలో ఆయన పెట్టుబడులు అన్నీ బయటపడ్పడాయి. ఇన్నాళ్లూ చాలావరకు ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకుల మీదే ఎక్కువగా ఐటీ దాడులు జరుగుతుండగా.. కన్సల్టెంటులు, లాబీయిస్టులు, లాయర్ల మీద దాడులు జరగడం ఈమధ్య కాలంలోనే మొదలైంది.
ఇంతకుముందు సంజయ్ భండారీ అనే రక్షణ రంగ వ్యాపారి, దీపక్ తల్వార్ అనే కార్పొరేట్ కన్సల్టెంటు, పీఎన్ సన్యాల్ అనే ఆదాయపన్ను అధికారి.. ఇలా రకరకాల రంగాలలో బాగా డబ్బులు సంపాదించినవాళ్ల మీద ఆదాయపన్ను శాఖ కన్నేసింది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా నల్లధనాన్ని బయటపెట్టాలంటూ ఒక పథకాన్ని ప్రవేశపెట్టి, దాని గడువు ముగిసిన వారం రోజుల తర్వాత లాయర్ ఇంటిమీద దాడి జరిగింది. ఇకమీదట ఇలా లెక్కలు చెప్పకుండా దాచిపెట్టుకున్న ఆదాయం మొత్తాన్ని బయటకు లాగుతామని ఆదాయపన్ను విభాగం అధికారులు చెబుతున్నారు.
Advertisement