delhi lawyer
-
మహిళా డీసీపీని పరుగెత్తించిన లాయర్లు..!
-
మహిళా డీసీపీని పరుగెత్తించిన లాయర్లు..!
సాక్షి, న్యూఢిలీ : పార్కింగ్ విషయంలో తలెత్తిన గొడవ ఢిల్లీ పోలీసులు, లాయర్లకు మధ్య ఘర్షణలకు దారితీసింది. తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో శనివారం జరిగిన ఈ ఘటనలో 30 మంది పోలీసులు, పలువురు లాయర్లకు గాయాలయ్యాయి. పరస్పరం కేసులు పెట్టుకున్నారు. దేశ రాజధానిలో జరిగిన ఈ గల్లీ ఫైటింగ్ సంచలనం రేపింది. ఇక ఈ ఘటనకు సంబంధించి తాజగా బయటపడిన సీసీటీవీ ఫుటేజ్, ఆడియో క్లిప్పింగ్‌లలో లాయర్ల జులుం బయటపడింది. వాటి ప్రకారం.. (చదవండి : రణరంగంగా తీస్‌హజారీ కోర్టు) ఓ మహిళా డీసీపీని కొందరు లాయర్ల గుంపు తరుముకుంటూ వస్తోంది. మఫ్టీలో ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బంది ఆమెకు రక్షణగా నిలిచి అక్కడి నుంచి బయటకు తీసుకెళ్తున్నారు. తన సహాయక సిబ్బందిలో ఒకరి పిస్టోల్‌ను ఎవరో కొట్టేశారని సదరు డీసీపీ ఆందోళనగా చెప్తున్నారు. సిబ్బంది సహాయంతో ఆమె ఎలాగోలా అక్కడి నుంచి బయటపడగలిగారు. మేడమ్‌ను బయటకు తీసుకొస్తున్న క్రమంలో లాయర్ల దాడిలో తన భుజానికి బలమైన గాయమైందని ఆమెకు రక్షణగా ఉన్న ఓ పోలీసు ఆవేదన వ్యక్తం చేశాడు. మేడమ్ సబార్డినేట్లలో ఒకరిది పిస్టోల్ కనిపించడం లేదని చెప్పాడు. వీటితోపాటు ఫుటేజ్‌లో కనిపించిన మరో దృశ్యం ఘటన తీవ్రతను వెల్లడిస్తోంది. దాంట్లో లాయర్లు ఓ మోటార్ సైకిల్‌కు నిప్పుపెట్టడం కనిపించింది. వెంటనే స్పందించిన పోలీసులు ఎగిసిపడుతున్న మంటల్ని ఆర్పివేశారు. లేదంటే ఆ పరిసరాల్లోని లాకప్‌లో ఉన్న 150 మంది ఖైదీల ప్రాణాలకు ముప్పు వాటిల్లేదే..! (చదవండి : ‘తీస్ హజారీ’ ఘటనపై న్యాయ విచారణ) ఇక కొందరు లాయర్లు సోమవారం మరో పోలీసుపై దాడికి దిగడంతో వివాదం మరింత ముదిరింది. పోలీసులు ఉన్నతాధికారులు లాయర్లకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ ఖాకీ సిబ్బంది ఒక్కటయ్యారు. గత మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఉన్నతాధికారులు నిజ నిర్ధారణ కమిటీ వేశారు. మహిళా పోలీసు అధికారి ఫిర్యాదును ఎఫ్ఐఆర్గా స్వీకరించారు. -
కోర్టు బయటే కుమ్ముకున్న లాయర్లు, పోలీసులు..!
-
కోర్టు బయటే కుమ్ముకున్న లాయర్లు, పోలీసులు..!
న్యూఢిల్లీ : కారు పార్కింగ్ విషయంలో లాయర్లు, పోలీసులకు మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ ఘటన తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో లాయర్లు పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. ఒకర్నొకరు తోసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక లాయర్‌కు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రులకు తరలించారు. ఆస్తులకు నష్టం, భయభ్రాంతులకు గురిచేయడం వంటి కారణాలు చూపుతూ పలువురు లాయర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే, పార్కింగ్ స్థలం విషయంలో గొడవ జరిగిందా.. మరైదైనా కారణం ఉందా తెలియాల్సి ఉంది. పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. కేసులు కూడా పెట్టారని ఆరోపిస్తూ.. కింది కోర్టుల న్యాయవాదులు ఆదివారం ధర్నాకు పిలుపునిచ్చారు. పోలీసు కమిషనర్, హోంశాఖకు మెమోరాండమ్ సమర్పిస్తామని తెలిపారు. ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ కేసీ మిట్టల్ లాయర్లపై దాడిని ఖండించారు. ఈదాడిలో ఒక లాయర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసుల తీరుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తప్పుబట్టారు. పార్కింగ్ విషయంలో గొడవ జరిగితే గాల్లోకి కాల్పులు జరుపుతారా అని ప్రశ్నించారు. బార్ కౌన్సిల్ ఈ విషయాన్ని ఊరికే వదిలేయదని స్పష్టం చేశారు. ఘటనకు బాధ్యులైన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, పోలీసు కమిషనర్‌ను కోరామని వెల్లడించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని లాయర్లకు సూచించారు. గొడవను కవర్ చేసే క్రమంలో ఓ కెమెరామెన్‌పై లాయర్లు దాడి చేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. -
రోహిత్ టాండన్ అరెస్ట్
న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో ఢిల్లీ లాయర్ రోహిత్ టాండన్ అరెస్టయ్యారు. ఆయనను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రూ. 70 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతవారం కోల్ కతాలో అరెస్టు చేసిన ప్రముఖ వ్యాపారవేత్త పర్సామల్ లోధాతో టాండన్ కు సంబంధాలున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 10న టాండన్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు జరిపి రూ. 14 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ. 2.2 కోట్ల విలువ చేసే రెండువేల రూపాయల నోట్లు ఉన్నాయి. తన ఇంట్లో దాడి జరుగుతున్న విషయాన్ని సీసీటీవీ కెమెరాల సాయంతో తన మొబైల్ ఫోన్లో చూసి, అటునుంచి అటే ఆయన అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. పదిరోజుల తర్వాత అధికారులకు చిక్కారు. ఆయనను కోర్టులో హాజరు పరచనున్నారు. చదవండి: (ఆ డబ్బును.. మూడు కార్లలో తరలించారు!) -
భార్య, కూతుళ్లను చితకబాదిన లాయర్!
ఆయనో న్యాయవాది. ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్నాడు. ఏమైందో ఏమో గానీ.. తన భార్యను, కూతురిని విపరీతంగా తిడుతూ కొట్టాడు. తన తండ్రి ఇలా చేయడాన్ని ఆయన మరో కూతురు మొత్తం వీడియో తీసి, పోలీసులకు అందజేసింది. ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ఆ న్యాయవాది తన కూతురిని గట్టిగా కొట్టడంతో ఆమె కింద పడిపోయింది. అతడు ఆమెను లాక్కుని వెళ్తూ, పిడిగుద్దులు కురిపించాడు. దక్షిణ ఢిల్లీలోని వసంత కుంజ్ ప్రాంతంలో ఈ న్యాయవాది కుటుంబం నివసిస్తుంది. తమకు పెళ్లయ్యి 15 ఏళ్లు అయ్యిందని, అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన తనను కొడుతూనే ఉన్నాడని న్యాయవాది భార్య తెలిపారు. తన ఇద్దరు కూతుళ్లను కూడా వదిలేవాడు కాడని అన్నారు. తనకు కొడుకులు పుట్టలేదన్న కోపంతోనే తమ ముగ్గురినీ ఇన్నాళ్లుగా కొడుతూ ఉన్నాడని చెప్పారు. పిల్లలిద్దరూ దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. -
ఆ డబ్బును.. మూడు కార్లలో తరలించారు!
ఆదాయపన్ను శాఖ అధికారులు ఒక ఇంట్లో సోదాలు చేసినప్పుడు భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది. దక్షిణ ఢిల్లీలోని రోహిత్ టాండన్ అనే న్యాయవాది ఇంట్లో మూడోసారి సోదాలు చేసినప్పుడు ఏకంగా 14 కోట్ల రూపాయల నల్లధనం పట్టుబడింది. ఆ డబ్బు మొత్తాన్ని అక్కడినుంచి తరలించడానికి అధికారులు మూడు పెద్ద కార్లు వాడాల్సి వచ్చింది. రెండు ఇన్నోవాలు, ఒక హోండా కారులో ఆరు సూట్‌కేసులు, నాలుగు స్టీలు ట్రంకుపెట్టెలలో ఆ డబ్బును తీసుకెళ్లారు. అతడివద్ద స్వాధీనం చేసుకున్నవాటిలో రూ. 2.2 కోట్ల విలువ చేసే రెండువేల రూపాయల నోట్లు ఉన్నాయి. అంటే, అవే 11వేల నోట్లన్నమాట. అవన్నీ ఆయన కార్యాలయంలో ఒక పక్కన పారేసి ఉన్నాయి. (చెట్టుకింద ప్లీడర్ ఇంట్లో.. రూ. 157 కోట్లు!) మొదటిసారి అక్టోబర్ 7వ తేదీన ఆ లాయర్ ఇంట్లో సోదాలు చేసినప్పుడే రూ. 125 కోట్లు పట్టుబడ్డాయి. రెండు వారాల క్రితం రెండోసారి దాడిచేసినప్పుడు రూ. 19 కోట్లు బయటపడ్డాయి. ఇప్పుడు మళ్లీ అతడి వద్ద డబ్బుందని విశ్వసనీయ సమాచారం అందడంతో.. మళ్లీ సోదాలు చేయగా, ఆయనైతే ఇంట్లో లేరు గానీ, ఇంటి నిండా ఎక్కడికక్కడ రహస్యంగా దాచిపెట్టిన డబ్బు కట్టలు, ఇంట్లో నలుమూలలా బిగించిన సీసీటీవీ కెమెరాలు కనిపించాయి. తన ఇంట్లో దాడి జరుగుతున్న విషయాన్న సీసీటీవీ కెమెరాల సాయంతో తన మొబైల్ ఫోన్లో చూసి, అటునుంచి అటే ఆయన అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు. (ఇంట్లో ఐటీ రెయిడ్.. ఫోన్లో లైవ్!) -
చెట్టుకింద ప్లీడర్ ఇంట్లో.. రూ. 157 కోట్లు!
ఆయనో న్యాయవాది. పేరు రోహిత్ టాండన్. కానీ ఆయన పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. సుప్రీంకోర్టు కాదు కదా, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో కూడా ఎవరూ ఆయనను గుర్తుపట్టరు. కానీ ఇప్పటివరకు ఆదాయపన్ను శాఖ అధికారులు ఆయన ఇంటి మీద చేసిన దాడుల్లో ఏకంగా రూ. 157 కోట్లు బయటపడ్డాయి. ఒకసారి కాదు.. ఏకంగా మూడు సార్లు దాడులు చేశారు. తాజాగా చేసిన దాడిలో 13.5 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. వాటిలో రద్దుచేసిన 500, 1000 రూపాయల కట్టలతో పాటు కొత్తగా విడుదలైన 2వేల రూపాయల కట్టలు కూడా ఉన్నాయి. వీటిలో కొత్తగా వచ్చిన 2000 రూపాయల నోట్లే ఏకంగా రూ. 2.61 కోట్ల మేరకు ఉన్నాయి. అన్ని నోట్లు ఈయనకు ఎక్కడినుంచి వచ్చాయన్న విషయమై ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు అధికారుల హస్తం లేకుండా ఇది సాధ్యం కాదని అంటున్నారు. ఆదాయపన్ను శాఖతో పాటు ఢిల్లీ క్రైంబ్రాంచి పోలీసులు కలిసి చేసిన సోదాల్లో.. టాండన్ ఇంట్లోని రహస్య ప్రదేశాల్లో భారీగా నోట్లు బయటపడ్డాయి. అట్టపెట్టెల్లో దాచిపెట్టిన నగదును మొత్తం బయటకు తీశారు. అయితే టాండన్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన కోసం గాలింపు మొదలైంది. దాదాపు గత రెండు నెలలుగా టాండన్ మీద ఢిల్లీ పోలీసులు కన్నేసి ఉంచారు. తొలిసారి అక్టోబర్ 7వ తేదీన ఈయన ఇల్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడి చేసినప్పుడు ఏకంగా 125 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. తాజాగా జరిగింది మూడో దాడి. రెండు వారాల క్రితం రెండోసారి దాడిచేసినప్పుడు రూ. 19 కోట్లు బయటపడ్డాయి. వీటిలో ఏ మొత్తానికీ ఆయన వద్ద లెక్కలు లేవు. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం గడువు ముగిసిన వారం రోజుల తర్వాత అందిన పక్కా సమాచారంతో తొలిసారి అక్టోబర్ 7న దాడి చేశారు. అప్పట్లో మనీలాండరింగ్‌కు సంబంధించిన కొన్ని పత్రాలు కూడా బయటపడ్డాయి. ఇప్పటి వరకు మూడు సోదాల్లో కలిపి ఈయన వద్ద రూ. 157 కోట్లు స్వాధీనమయ్యాయి. -
రూ.125 కోట్ల గుప్త ధనం
-
లాయర్‌కు రూ. 125 కోట్లకు పైగా ఆస్తులు!
సుప్రీంకోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టులో కూడా ప్రాక్టీసు చేస్తున్న లాయర్ ఆస్తులు చూసి ఆదాయపన్నుశాఖ అధికారులే నోళ్లు వెళ్లబెట్టారు. లెక్కల్లోకి రాని ఆస్తి తనకు దాదాపు రూ. 125 కోట్ల వరకు ఉంటుందని ఆయన స్వయంగా వెల్లడించారు. దక్షిణ ఢిల్లీలోని ఆయన ఇంటిమీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు ఈ విషయం తెలిసింది. ఈమధ్యే ఆయన ఢిల్లీలో రూ. 100 కోట్లు పెట్టి పెద్ద బంగ్లా కొనడంతో ఆయన మీద అందరి దృష్టి పడింది. దాంతోపాటు ఐటీ దాడులు చేయగా, పలు రకాల ఆస్తులు, బూటకపు కంపెనీలలో ఆయన పెట్టుబడులు అన్నీ బయటపడ్పడాయి. ఇన్నాళ్లూ చాలావరకు ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకుల మీదే ఎక్కువగా ఐటీ దాడులు జరుగుతుండగా.. కన్సల్టెంటులు, లాబీయిస్టులు, లాయర్ల మీద దాడులు జరగడం ఈమధ్య కాలంలోనే మొదలైంది. ఇంతకుముందు సంజయ్ భండారీ అనే రక్షణ రంగ వ్యాపారి, దీపక్ తల్వార్ అనే కార్పొరేట్ కన్సల్టెంటు, పీఎన్ సన్యాల్ అనే ఆదాయపన్ను అధికారి.. ఇలా రకరకాల రంగాలలో బాగా డబ్బులు సంపాదించినవాళ్ల మీద ఆదాయపన్ను శాఖ కన్నేసింది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా నల్లధనాన్ని బయటపెట్టాలంటూ ఒక పథకాన్ని ప్రవేశపెట్టి, దాని గడువు ముగిసిన వారం రోజుల తర్వాత లాయర్ ఇంటిమీద దాడి జరిగింది. ఇకమీదట ఇలా లెక్కలు చెప్పకుండా దాచిపెట్టుకున్న ఆదాయం మొత్తాన్ని బయటకు లాగుతామని ఆదాయపన్ను విభాగం అధికారులు చెబుతున్నారు.