ఆ డబ్బును.. మూడు కార్లలో తరలించారు!
ఆ డబ్బును.. మూడు కార్లలో తరలించారు!
Published Tue, Dec 13 2016 9:16 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
ఆదాయపన్ను శాఖ అధికారులు ఒక ఇంట్లో సోదాలు చేసినప్పుడు భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది. దక్షిణ ఢిల్లీలోని రోహిత్ టాండన్ అనే న్యాయవాది ఇంట్లో మూడోసారి సోదాలు చేసినప్పుడు ఏకంగా 14 కోట్ల రూపాయల నల్లధనం పట్టుబడింది. ఆ డబ్బు మొత్తాన్ని అక్కడినుంచి తరలించడానికి అధికారులు మూడు పెద్ద కార్లు వాడాల్సి వచ్చింది. రెండు ఇన్నోవాలు, ఒక హోండా కారులో ఆరు సూట్‌కేసులు, నాలుగు స్టీలు ట్రంకుపెట్టెలలో ఆ డబ్బును తీసుకెళ్లారు. అతడివద్ద స్వాధీనం చేసుకున్నవాటిలో రూ. 2.2 కోట్ల విలువ చేసే రెండువేల రూపాయల నోట్లు ఉన్నాయి. అంటే, అవే 11వేల నోట్లన్నమాట. అవన్నీ ఆయన కార్యాలయంలో ఒక పక్కన పారేసి ఉన్నాయి. (చెట్టుకింద ప్లీడర్ ఇంట్లో.. రూ. 157 కోట్లు!)
మొదటిసారి అక్టోబర్ 7వ తేదీన ఆ లాయర్ ఇంట్లో సోదాలు చేసినప్పుడే రూ. 125 కోట్లు పట్టుబడ్డాయి. రెండు వారాల క్రితం రెండోసారి దాడిచేసినప్పుడు రూ. 19 కోట్లు బయటపడ్డాయి. ఇప్పుడు మళ్లీ అతడి వద్ద డబ్బుందని విశ్వసనీయ సమాచారం అందడంతో.. మళ్లీ సోదాలు చేయగా, ఆయనైతే ఇంట్లో లేరు గానీ, ఇంటి నిండా ఎక్కడికక్కడ రహస్యంగా దాచిపెట్టిన డబ్బు కట్టలు, ఇంట్లో నలుమూలలా బిగించిన సీసీటీవీ కెమెరాలు కనిపించాయి. తన ఇంట్లో దాడి జరుగుతున్న విషయాన్న సీసీటీవీ కెమెరాల సాయంతో తన మొబైల్ ఫోన్లో చూసి, అటునుంచి అటే ఆయన అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు. (ఇంట్లో ఐటీ రెయిడ్.. ఫోన్లో లైవ్!)
Advertisement