సాక్షి, న్యూఢిలీ : పార్కింగ్ విషయంలో తలెత్తిన గొడవ ఢిల్లీ పోలీసులు, లాయర్లకు మధ్య ఘర్షణలకు దారితీసింది. తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో శనివారం జరిగిన ఈ ఘటనలో 30 మంది పోలీసులు, పలువురు లాయర్లకు గాయాలయ్యాయి. పరస్పరం కేసులు పెట్టుకున్నారు. దేశ రాజధానిలో జరిగిన ఈ గల్లీ ఫైటింగ్ సంచలనం రేపింది. ఇక ఈ ఘటనకు సంబంధించి తాజగా బయటపడిన సీసీటీవీ ఫుటేజ్, ఆడియో క్లిప్పింగ్‌లలో లాయర్ల జులుం బయటపడింది. వాటి ప్రకారం..
ఓ మహిళా డీసీపీని కొందరు లాయర్ల గుంపు తరుముకుంటూ వస్తోంది. మఫ్టీలో ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బంది ఆమెకు రక్షణగా నిలిచి అక్కడి నుంచి బయటకు తీసుకెళ్తున్నారు. తన సహాయక సిబ్బందిలో ఒకరి పిస్టోల్‌ను ఎవరో కొట్టేశారని సదరు డీసీపీ ఆందోళనగా చెప్తున్నారు. సిబ్బంది సహాయంతో ఆమె ఎలాగోలా అక్కడి నుంచి బయటపడగలిగారు.
మేడమ్‌ను బయటకు తీసుకొస్తున్న క్రమంలో లాయర్ల దాడిలో తన భుజానికి బలమైన గాయమైందని ఆమెకు రక్షణగా ఉన్న ఓ పోలీసు ఆవేదన వ్యక్తం చేశాడు. మేడమ్ సబార్డినేట్‌లలో ఒకరిది పిస్టోల్ కనిపించడం లేదని చెప్పాడు. వీటితోపాటు ఫుటేజ్‌లో కనిపించిన మరో దృశ్యం ఘటన తీవ్రతను వెల్లడిస్తోంది. దాంట్లో లాయర్లు ఓ మోటార్ సైకిల్‌కు నిప్పుపెట్టడం కనిపించింది. వెంటనే స్పందించిన పోలీసులు ఎగిసిపడుతున్న మంటల్ని ఆర్పివేశారు. లేదంటే ఆ పరిసరాల్లోని లాకప్‌లో ఉన్న 150 మంది ఖైదీల ప్రాణాలకు ముప్పు వాటిల్లేదే..!
ఇక కొందరు లాయర్లు సోమవారం మరో పోలీసుపై దాడికి దిగడంతో వివాదం మరింత ముదిరింది. పోలీసులు ఉన్నతాధికారులు లాయర్లకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ ఖాకీ సిబ్బంది ఒక్కటయ్యారు. గత మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఉన్నతాధికారులు నిజ నిర్ధారణ కమిటీ వేశారు. మహిళా పోలీసు అధికారి ఫిర్యాదును ఎఫ్‌ఐఆర్‌గా స్వీకరించారు.