
న్యూఢిల్లీ : కారు పార్కింగ్ విషయంలో లాయర్లు, పోలీసులకు మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ ఘటన తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో లాయర్లు పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. ఒకర్నొకరు తోసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక లాయర్‌కు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రులకు తరలించారు.
ఆస్తులకు నష్టం, భయభ్రాంతులకు గురిచేయడం వంటి కారణాలు చూపుతూ పలువురు లాయర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే, పార్కింగ్ స్థలం విషయంలో గొడవ జరిగిందా.. మరైదైనా కారణం ఉందా తెలియాల్సి ఉంది. పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. కేసులు కూడా పెట్టారని ఆరోపిస్తూ.. కింది కోర్టుల న్యాయవాదులు ఆదివారం ధర్నాకు పిలుపునిచ్చారు. పోలీసు కమిషనర్, హోంశాఖకు మెమోరాండమ్ సమర్పిస్తామని తెలిపారు.
ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ కేసీ మిట్టల్ లాయర్లపై దాడిని ఖండించారు. ఈదాడిలో ఒక లాయర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసుల తీరుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తప్పుబట్టారు. పార్కింగ్ విషయంలో గొడవ జరిగితే గాల్లోకి కాల్పులు జరుపుతారా అని ప్రశ్నించారు. బార్ కౌన్సిల్ ఈ విషయాన్ని ఊరికే వదిలేయదని స్పష్టం చేశారు. ఘటనకు బాధ్యులైన పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, పోలీసు కమిషనర్‌ను కోరామని వెల్లడించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని లాయర్లకు సూచించారు. గొడవను కవర్ చేసే క్రమంలో ఓ కెమెరామెన్‌పై లాయర్లు దాడి చేశారని ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment