
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో మెట్రో రైల్ ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ), లేబర్ కమిషన్ అధికారులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో మెట్రో సిబ్బంది శనివారం నుంచి సమ్మె బాట పట్టనున్నారు. మెట్రో సిబ్బంది సమ్మె హెచ్చరికల నేపథ్యంలో ప్రతిష్టంభన సమసిపోయేలా చొరవ చూపాలని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ డీఎంఆర్‌సీని ఆదేశించినా చర్చలు ఇప్పటివరకూ ఓ కొలిక్కిరాకపోవడంతో ఉద్యోగులు సమ్మెకు సంసిద్ధమవుతున్నారు.
డిమాండ్ల సాధన కోసం జూన్ 19 నుంచి నిరసనలు తెలుపుతున్న మెట్రో సిబ్బంది శనివారం నుంచి నిరవధిక సమ్మె బాట పట్టనున్నారు. మెట్రో సిబ్బంది సమ్మెతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. అయితే వారాంతం కావడంతో శని, ఆదివారాలు సమ్మె ప్రభావం పెద్దగా ఉండబోదని భావిస్తున్నారు. ఢిల్లీ మెట్రోకు చెందిన 9000 మందికి పైగా నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు వేతన చెల్లింపులు, ఇతర డిమాండ్ల సాధన కోసం నిరసన బాట పట్టిన సంగతి తెలిసిందే.