న్యూఢిల్లీ : తమ అదృష్టం బాగాలేదని, అందుకే కుమారుడు పక్షవాతంతో మరణించాడని భావించారు ఆ తల్లిదండ్రులు. కానీ కుమారుడి సెల్‌లో దొరికిన కాల్ రికార్డింగ్‌లు, కోడలి నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ కొడుకు మృతికి కోడలే కారణమనే అనుమానాలను పెంచింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఫలితంగా వ్యక్తి చనిపోయిన 18 రోజుల తర్వాత అతని మృతదేహాన్ని శ్మశానం నుంచి వెలికితీసి పోస్టుమార్టం పోలీసులు నిర్వహిస్తున్నారు. కలకలం రేపిన ఈ సంఘటన ఢిల్లీలోని మంగోల్‌పూరిలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీలోని బెగంపూర్ నివాసికి 2007లో వివాహయ్యింది. అతడు ఫర్నిచర్ షాపు నిర్వహిస్తుండగా భార్య ఇంటి దగ్గరే ఉండేది. వీరికి ఇద్దరు పిల్లలు. మార్చి 6న ఆ వ్యక్తి ఉన్నట్టుండి కిందపడిపోయాడు. వెంటనే తల్లిదండ్రులు అతన్ని ఆస్పత్రికి తీసుకు వెళ్లగా ఈ నెల 9న మృతి చెందాడు. ఎక్కువ మొత్తంలో మత్తు పదార్థాలు తీసుకోవడం వల్లే అతడు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మంగోల్‌పూరిలోనే అతనికి దహనసంస్కారాలు నిర్వహించారు.
అనుమానమొచ్చిందిలా...
ఈ నెల 20న మృతుడి తల్లిదండ్రులు ఇంటిని శుభ్రం చేయడానికి వెళ్లినప్పుడు అక్కడ వారికి కోడలి డ్రైవింగ్ లైసెన్స్ దొరికింది. కానీ అది నకిలీది. దానిలో వారి కుమారుని పేరు బదులు వారి మేనల్లుని పేరు ఉంది. అదే సమయంలో వారికి కొడుకు సెల్‌లో కోడలు, మేనల్లుని మధ్య జరిగిన సంభాషణల రికార్డు కూడా లభించింది. మార్చి 6న జరిగిన సంభాషణ అందులో రికార్డయ్యింది. ఆ రోజు మృతుడు తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో నిద్రలేచాడు. ఆ సమయంలో అతని భార్య ఎవరితోనొ ఫోన్‌లో మాట్లడుతుంది. దాంతో ఆమెను భర్త కొట్టాడు. ఆ సమయంలో భార్య సహాయం కోసం భర్త సెల్‌నుంచే తన ప్రేమికుడికి ఫోన్ చేసింది. భర్త తన అత్తమామలకు ఫోన్‌చేసి ఈ విషయాన్ని వారికి కూడా తెలిపాడు. ఈ విషయాలన్ని ఫోన్‌లో రికార్డయ్యాయి. ఫోన్‌ను, నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ను మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు సాక్ష్యంగా సమర్పించారు.
తన కోడలు ఆమె ప్రేమికునితో కలిసి హానికారక పదార్ధాలను ఇచ్చి తమ కొడుకు మరణించేలా చేసిందని అతని తండ్రి పోలీసులకు రాత పూర్వక ఫిర్యాదు ఇచ్చారు. సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఈ కేసులో మృతదేహాన్ని తవ్వితీసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రోహిణి) రజనీష్ గుప్తా చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రమే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment