కాల్చుకుని చనిపోయిన ఏసీపీ.. దూకేసిన భార్య
ఆయనో సీనియర్ పోలీసు అధికారి. ఏసీపీ స్థాయిలో ఉన్నారు. ఏం జరిగిందో ఏమో గానీ.. రివాల్వర్‌తో తనను తాను కాల్చుకుని చనిపోయారు. ఆ తర్వాత ఆయన భార్య వాళ్లుండే అపార్టుమెంట్ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకేసింది. ఈ దారుణ ఘటన ఢిల్లీ శివార్లలోని నోయిడాలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న అమిత్ సింగ్, సరిత దంపతులకు 18 నెలల కుమార్తె కూడా ఉంది.
ఈ ఘటన జరిగిన తర్వాత అపార్టుమెంట్‌లో ఉండేవాళ్లు పోలీసులకు ఫోన్ చేశారు. దంపతులను ఆస్పత్రికి తరలించగా, అమిత్ సింగ్ అప్పటికే మరణించారని, ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనకు కారణం ఏంటో మాత్రం ఇంకా తెలియడం లేదు. అమిత్ సింగ్ ఓ గదిలోకి వెళ్లి, తలుపు వేసుకుని కాల్చేసుకున్నారు. ఆ శబ్దం వినగానే సరిత పరుగున వెళ్లి గార్డును, ఇరుగు పొరుగులను పిలిచింది. మృతదేహాన్ని చూడగానే ఆమె వెళ్లి బాల్కనీ లోంచి దూకేసింది. మూడేళ్ల క్రితం పెళ్లయిన ఈ దంపతుల మధ్య ఇటీవల తరచు గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది.