రాష్ట్రపతి భవన్ వద్ద కలకలం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వద్ద కలకలం రేగింది. రాష్ట్రపతి భవన్ వెలుపల అనుమానిత బ్యాగ్ ఉందన్న వదంతులు దావానంలా వ్యాపించడంతో బలగాలు పరుగులు పెట్టాయి. హుటాహుటిన రాష్ట్రపతి భవన్ వద్ద మోహరించి తనఖీలు ప్రారంభించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ఫోన్ చేసి రాష్ట్రపతి భవన్ ఒకటో నెంబర్ గేట్ వద్ద బయట ఏదో గుర్తు తెలియని బ్యాగ్ ఉందని పోలీసులకు చెప్పారు.
దీంతో ఉన్నపలంగా పోలీసులు వచ్చి ఆ చుట్టుపక్కల సోదాలు చేస్తుండగా ఏమీ లభించలేదు. ఇంకా బలగాల గాలింపు జరుగుతునే ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీతోపాటు కొన్ని ముఖ్యమైన స్థావరాలపై బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని, పోలీసు విభాగం అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించిన విషయం తెలిసిందే.