న్యూఢిల్లీ : తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ నుంచి సరైన సమాధానం రానుందున ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు ఐదోసారి నోటీసులు జారీ చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో తబ్లిగీ జమాత్ కార్యక్రమాన్ని లాక్ డౌన్ నిబంధనలకు విరుద్దంగా నిర్వహించడంపై మౌలానా సాద్‌పై కేసు నమోదైన విషయం విదితమే. ఇప్పటికే సాద్‌పై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 కింద కేసులు నమోదు చేయడంతో పాటు.. తబ్లీగ్ జమాత్‌కు విదేశాల నుంచి మనీలాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించి హవాలా ద్వారా విరాళాలు సేకరించారని ఆరోపిస్తూ ఈడీ అధికారులు కూడా కేసులు నమోదు చేశారు.
గల్ఫ్ దేశాల నుంచి ఢిల్లీలోని తబ్లీగ్ జమాత్ పెద్దల ఖాతాల్లోకి కోట్లాదిరూపాయల నిధులు వచ్చాయని ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో తేలడం సంచలనం రేపింది. నిజాముద్దీన్ మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ తోపాటు అతని సన్నిహితుల ఖాతాల్లోకి గల్ఫ్ దేశాల నుంచి నిధులు వచ్చాయని తేలింది. జమాత్ చీఫ్ మౌలానా సాద్, అతని సన్నిహితుల బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన కోట్లాదిరూపాయల నగదు వివరాలను ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు సమాచారం అందించారు. మౌలానా సాద్ తోపాటు అతని ముగ్గురు కుమారులు, మేనల్లుడి ఖాతాల్లోకి గల్ఫ్ డబ్బు వచ్చిందని సమాచారం. వీరిని ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు ఇప్పటికే విచారించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పంపిన నోటీసులకు మౌలానా సాద్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment