
ఢిల్లీలో ముగిసిన పోలింగ్
ఢిల్లీ అసెంబ్లీకి శనివారం జరిగిన పోలింగ్ ముగిసింది. ఢిల్లీలో ఎన్నికలు ప్రశాతంగా ముగియడంతోపాటు.. పోలింగ్ శాతం కూడా భారీగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి శనివారం జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఢిల్లీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతోపాటు.. పోలింగ్ శాతం కూడా భారీగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఈ సాయంత్రం ఐదు గంటలు వరకూ జరిగిన పోలింగ్ 63.5 శాతంగా నమోదు అయినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే క్యూలైన్లో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే ఆస్కారం ఉండటంతో పోలింగ్ శాతం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో డబ్బై శాతం వరకూ పోలింగ్ నమోదు కావచ్చని ప్రాధమికంగా అంచనాకు రావడంతో ప్రధాన పార్టీలన్నీ తమ గెలుపుపై ఆశలు పెట్టుకున్నాయి. మొత్తం 70 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 673 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 63 మంది మహిళలు కూడా ఢిల్లీ ఎన్నికల్లో బరిలో దిగడం విశేషం. అతిపెద్ద నియోజకవర్గమైన వికాస్ పురిలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
అయితే ఓటింగ్ శాతం పెరిగిందని అంచనాకు రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీ కూడా హస్తిన విజయం తమదేనని తెలిపింది. ఇక్కడ మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇప్పటికే స్పష్టం చేశారు.డబ్బై శాతానికి పైగా పోలింగ్ నమోదైతే మాత్రం ఢిల్లీలో సంపూర్ణ మెజార్టీ సాధిస్తామని ఆయన అన్నారు.