సాక్షి, న్యూఢిల్లీ:దేశ రాజధాని నగరంలో వరసగా మూడోరోజు కూడా కాలుష్యపొగ కమ్మేసింది. విషవాయువుల కౌగిలిలో ఢిల్లీ అతలాకుతలమవుతోంది. కాలుష్యస్థాయి ప్రమాదకరస్థాయిని మించి నమోదైందని తాజా రిపోర్టులు వెల్లడించాయి. ఈ రోజుకూడా మరింత భయానక పరిస్థితి కొనసాగనుందని హెచ్చరించాయి. వదల బొమ్మాళీ.. అంటూ వెంటాడుతున్న కాలుష్య భూతాన్ని తలుచుకొని ఢిల్లీ జనం బిక్కు బిక్కుమంటోంది. రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. వరుసగా మూడోరోజుకూడా ఇదే పరిస్థితి కనిపిస్తుండటంతో మరింత ఆందోళన చెలరేగింది.
అటు వెన్నులో వణుకుపుట్టించే చలి..ఇటు గుండెల్లో దడ పుట్టిస్తున్న కాలుష్యం...ఇదీ ఢిల్లీ మహానగర పరిస్థితి. దీంతో ఢిల్లీ సర్కార్‌పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. అటు ప్రయివేటు వాహనాలను చాలా తగ్గించాలని, కాలుష్య నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అలాగే సరి-బేసి స్కీమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలని కోరింది. దీనిపై ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఎప్పటికపుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. వ్యక్తిగత వాహనాలపై ఆంక్షలు, ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అయితే మరోవైపు కాలుష్య కాసారంలో చిక్కుకున్న ఢిల్లీ నగరాన్ని రక్షించే చర్యలు, ఆడ్-ఈవెన్ స్కీమ్‌పై లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఈ రోజు నిర్ణయం తీసుకోనున్నారు. అటు హర్యానా,పంజాబ్ రాష్ట్రాలు కూడా త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నాయి.
మరోవైపు ధూమపానానికి స్వస్తి చెప్పాలని నీళ్లు ఎక్కువగా తాగాలని ప్రముఖ వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు. బయటికి తిరగవద్దని, ఏమాత్రం శ్వాస ఇబ్బంది అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని ఢిల్లీ వైద్య బృందం హెచ‍్చరికలు జారీ చేసింది. దట్టంగా పొగమంచు ఢిల్లీని కప్పివేయడంతో పలురైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment