న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల్లో భాగంగా నిరసనకారులు ఓ స్కూలుకి నిప్పంటించారు. పుస్తకాలు, బెంచీలు, కంప్యూటర్లు సహా పరీక్షా పత్రాలు అన్నీ కాలిబూడిదయ్యాయి. మంగళవారం జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. పుస్తకాలు, యూనిఫాంలు మంటల్లో కాలిపోయిన నేపథ్యంలో విద్యార్థులకు నష్టపరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక, మద్దతు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా... అరుణ్ మోడ్రన్ సీనియర్ సెకండరీ స్కూలుకు ఆందోళనకారులు మంగళవారం నిప్పుపెట్టారు. అయితే ఆ సమయంలో విద్యార్థులెవరూ స్కూళ్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులు ఇంటికి వెళ్లిపోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆస్తి నష్టం భారీగా సంభవించింది. (ఆ కుటుంబాలకు రూ. 10 లక్షలు: కేజ్రీవాల్)
ఈ విషయం గురించి స్కూలు క్యాషియర్ నీతూ చౌదరి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ స్కూళ్లో దాదాపు 3000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆరోజు 200 నుంచి 300 మంది నిరసనకారులు వచ్చి స్కూలును చుట్టుముట్టారు. ఏం చేయాలో అర్థంకాక వాచ్‌మెన్ అక్కడి నుంచి వెనుక గేటు గుండా పారిపోయాడు. ఆ తర్వాత స్కూలుకు నిప్పంటించారు. దాదాపు నాలుగు గంటల పాటు మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఫైర్‌మెన్ వచ్చి మంటలు చల్లార్చారు’’అని పేర్కొన్నారు. ఈ ఘటనలో స్కూలు బస్సు, కారు, మానిటర్లు, సీపీయూలు పాక్షికంగా కాలిపోయాయని... బెంచీలు, పుస్తకాలు, ఇతర పత్రాలు బూడిదైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆదివారం సాయంత్రం మొదలైన ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు దాదాపు 30 మంది మృత్యువాతపడగా.. 200 మందికి పైగా గాయపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సీఎం కేజ్రీవాల్ నష్టపరిహారం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment