కావాలనే అడ్డుకుంటున్నారు!
పార్లమెంటు స్తంభనపై విపక్షాలపై మోదీ ధ్వజం
- ప్రధాని హెలికాప్టర్ దిగేందుకు వాతావరణం ప్రతికూలం..
- మొబైల్ ద్వారా బహ్రెయిచ్ ర్యాలీలో ప్రధాని ప్రసంగం
బహ్రయిచ్ (యూపీ): నోట్లరద్దుపై ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. విపక్షాలు కావాలనే పార్లమెంటును అడ్డుకుంటున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆదివారమిక్కడ జరిగిన ఎన్నికల సభలో మొబైల్ ఫోన్ ద్వారా ఆయన ప్రసంగించారు. ‘20 రోజులుగా పార్లమెంటు జరగటం లేదు. నోట్లరద్దుపై చర్చకు మేం సిద్ధంగానే ఉన్నాం. కానీ మా ఆలోచనలను చెప్పేందుకు ప్రజలు తిరస్కరించిన పార్టీలు అవకాశం ఇవ్వటం లేదు. వాస్తవాలను అణచేసేందుకు మూకుమ్మడిగా ప్రయత్నిస్తున్నారు’ అని విమర్శించారు. విపక్షాలు ఎప్పుడూ నిజారుుతీ మార్గంలో నడిచేందుకు ఆసక్తి చూపలేదన్న మోదీ.. అవినీతికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం జరుపుతున్న పోరులో ఎక్కడా రాజీపడేది లేదని స్పష్టం చేశారు. నేపాల్ సరిహద్దుకు సమీపంలోని బహ్రరుుచ్ ర్యాలీలో మోదీ ప్రసంగించాల్సి ఉంది.
అయితే.. ప్రతికూల వాతావరణం వల్ల మోదీ ప్రయాణించిన వాయుసేన హెలికాప్టర్ బహ్రరుుచ్ వెళ్లలేకపోరుుంది. దీంతో మొబైల్ ఫోన్ ద్వారానే పరివర్తన్ ర్యాలీకి హాజరైన వారినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ‘తొలిసారిగా నల్లధన కుబేరులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మీరు చూస్తున్నారు. మా ప్రభుత్వం పేదల సాధికారతకు కట్టుబడి ఉంది. దేశం ప్రగతిపథంలో దూసుకుపోతున్న తరుణంలో ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలను ప్రజలు భరిస్తున్నారు’ అని ప్రధాని తెలిపారు. నల్లధనంపై కొరడా ఝుళిపించిన తర్వాత చాలా మంది సీనియర్ బ్యాంకు అధికారులూ పట్టుబడ్డారన్న ప్రధాని.. ‘మా ప్రభుత్వం ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడింది. అలాంటి ప్రజలను ఇబ్బంది పెట్టేవారెవరినీ సహించేదిలేదు’ అని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ, విపక్ష బీఎస్పీ దొందూ దొందేనన్నారు.
నోట్ల రద్దు వల్ల ఈ రెండు పార్టీలు చాలా ఇబ్బందులు పడుతున్నాయన్నారు. పార్లమెంటు ప్రతిష్టం భనలో వీటికీ భాగముందన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజలకు గూండాలు, రౌడీల ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నారని మోదీ అన్నారు. యూపీ అభివృద్ధి పథంలో నడిచేందుకు పేదరికం, గూండాల రాజ్యం తొలగించటమే మార్గమన్నారు. కాగా, మోదీ విమర్శలపై బీఎస్పీ చీఫ్ మాయావతి ఘాటుగా స్పందించారు. దొంగే.. దొంగా, దొంగా అని అరిచినట్లుందని ధ్వజమెత్తారు.